ఫోర్ డేస్...సేమ్ సీన్...ఎందుకంటే?

Update: 2018-03-21 09:30 GMT

పార్లమెంటు ఉభయసభలూ గత నాలుగు రోజుల నుంచి హైడ్రామా కొనసాగుతోంది. ప్రతిరోజూ వాయిదాల పర్వం కొనసాగతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీలు రెండూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు రోజూ ఇస్తూనే ఉన్నాయి. సభ ఆర్డర్ లో లేదంటూ రోజూ వాయిదా వేస్తూనే ఉన్నారు. లోక్ సభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగినా ఆ పార్టీకి ఎటువంటి నష్టమూ లేదు. జరగదు కూడా. కాని అవిశ్వాసంపై చర్చకు వస్తే ఏపీకి ఏం చేశామన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది.

చర్చకు సిద్ధమంటూనే...

అయితే ఇప్పటికే కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తాము ఏపీకి చేయాల్సిందంతా బయట చెబుతూ వస్తూనే ఉన్నారు. కొన్నింటికి ఏపీ సర్కార్ లెక్కలు చెప్పడం లేదని, మరికొన్నింటికి తాము ఫార్ములా రూపొందించి పంపమని చెప్పినా ఏపీ సర్కార్ విన్పించుకోవడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే చర్చకు బీజేపీ ఎందుకు వెనకడుగు వేస్తుందన్నది అర్థం కావడం లేదని టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ పై భయం లేనప్పుడు, చర్చకు సిద్ధమేననిచెబుతున్నప్పుడు బీజేపీ ఎందుకు వెనక్కుతగ్గుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

పిలిచి మాట్లాడకుండా....

అయితే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కూడా ఏపీ ఎంపీలకు చికాకును తెప్పిస్తోంది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలను స్పీకర్ పిలిచి మాట్లాడి సభలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే వీలుందున్నారు. కాని స్పీకర్ వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదంటున్నారు. కావేరీ జలాలపై మండలిని ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో వారి డిమాండ్ ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదు. అయినా వారిని చర్చలకు పిలిచి మాట్లాడకుండా, వారిని ఆందోళనకు బీజేపీయే పురిగొల్పుతుందని ఏపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.

బీహార్ వల్లనేనా?

కాగా చర్చకు బీజేపీ సిద్ధమేనని చెబుతోంది. వాస్తవానికి కూడా ఏపీకి ఏమేం చేశామో చెప్పుకునే వీలుంది. వారి పార్టీ సమావేశాల్లో ఏపీకి ఇప్పటి వరకూ చేసిన సాయం గురించి ఆ పార్టీ పెద్దలు వివరించారు. అయితే అవిశ్వాసం పై చర్చ జరిగితే బీహార్ అంశం కూడా వెలుగులోకి వస్తుందని బీజేపీ నేతలు వెనకడుగు వేస్తున్నారు. బీహార్ కూడా తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇటీవల స్వరం పెంచింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సయితం తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలిందేనంటన్నారు. తాజాగా బీహార్ ఎంపీ పప్పు యాదవ్ కూడా తమకు ప్రత్యేక హోదా కావాలంటూ అత్యవసర చర్చ జరపాలంటూ నోటీసులిచ్చారు. ఇలా బీహార్ వల్లనే చర్చకు బీజేపీ వెనుకంజ వేస్తుందని పార్లమెంటు ఆవరణలో ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.

Similar News