సినిమా పరిశ్రమ తరఫున తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వకాల్తా పుచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న తాజా పన్ను విధానం వలన సినిమా పరిశ్రమకు చాలా నష్టం వాటిల్లుతుందని, సినిమా రంగానికి సంబంధించినంత వరకు పన్నుల విధానంలో మార్పు చేర్పులు ఉండాలనే విజ్ఞప్తితో ఆయన కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ వద్దకు వెళ్లారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున నిర్మాతలు దగ్గుబాటి సురేశ్ బాబు, సి. కల్యాణ్ లతో కలిసి అరుణ్‌జైట్లీ ని కలిసి జీఎస్టీని సినిమా పరిశ్రమకు వర్తించే విషయంలో మినహాయింపుల గురించి కోరడం విశేషం.
జీఎస్టీ రూపంలో 24 శాతం పన్ను వేయడం వల్ల సినిమా పరిశ్రమకు చాలా నష్టం వాటిల్లుతుందనేది తెలుగు నిర్మాతలు దగ్గుబాటి సురేశ్ బాబు, సి.కల్యాణ్ లు వినిపిస్తున్న వాదన. అయితే జీఎస్టీ అనేది కేవలం టాలీవుడ్ సినిమాలకు మాత్రమే విధించే పన్ను వ్యవస్థ కాదు. దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానంగా ఇది అమలు అవుతుంది. అలాంటప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు చలనచిత్ర రంగం ఒక చిన్న భాగం మాత్రమే. మనల్ని మించి భారీ బడ్జెట్ లతో, పెద్ద సంఖ్యలో చిత్రాలు నిర్మించే రంగాలు చాలానే ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో జీఎస్టీ అనే నూతన పన్ను విధానం వలన బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఎవ్వరకీ రాని ఇబ్బంది తెలుగు నిర్మాతలకు మాత్రమే ఎందుకు వచ్చిందో... అలాంటి నేపథ్యంలోనూ తెలంగాణ మరియు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరఫున సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్లు ప్రాతినిధ్యం వహించకుండా.. కీలకమైన ప్రతిదానికీ తానే పూనిక వహించే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్మాతల్ని తీసుకుని కేంద్రమంత్రి వద్దకు వెళ్లడం ఏమిటో అర్థం కాని సంగతి.
తమ సమస్యలను కేంద్రానికి వివరించేందుకు చొరవ చూపించినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సురేశ్ బాబు ప్రకటన కూడా విడుదల చేసేశారు. 24 శాతం పన్ను విధింపు వలన చిత్ర పరిశ్రమ చాలా నష్టపోతుందని నిర్మాతలు కేంద్రానికి తెలియజేశారు. అయితే ఈ విషయంలో అరుణ్ జైట్లీ ఎలా స్పందిస్తారో.. చాలా ఖర్చుల విషయంలో అపరిమితమైన రెమ్యునరేషన్లు ఇలా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉండే చిత్రపరిశ్రమకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడానికి మొగ్గు చూపుతారో లేక తనదైన విచక్షణను ప్రదర్శిస్తారో వేచిచూడాలి.