ఫడ్నవిస్ ను చూసి నేర్చుకో బాబూ

Update: 2018-03-16 10:30 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ముద్రగడ స్పందించారు. చంద్రబాబుకు నేరుగా లేఖ రాశారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీ కన్నీరు కార్చింది నిజమేనా? నటనా? అని ప్రశ్నించారు. ఒకవేళ నిజమే అయితే మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నప్పుడు రైతుల కన్నీరు మీకు కనపడలేదా? బాబూ అని ప్రశ్నించారు.

రైతుల కన్నీళ్లు కనపడలేదా?

అలాగే కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ తాము రోడ్డెక్కిన్నప్పుడు, తమ జాతి యువకులను ఈడ్చి తన్నినప్పుడు మా కన్నీరు కన్పించలేదా? అని నిలదీశారు. రైతుల భూములను తీసుకుని వ్యాపారం చేస్తున్న సంగతి నిజం కాదా? అని ముద్రగడ తన లేఖలో కోరారు. అలాగే గోదావరి పుష్కరాల సమయంలో 30 మంది భక్తులు చనిపోతే వారి కన్నీటిని గోదావరిలో కలిపేశారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని, రాజకీయ మేధావినంటూ డబ్బాలు కొట్టుకోవడం మానుకోవాలని హితవు పలికారు.

బాబూ నటన మానుకోండి....

చంద్రబాబు నటనను, అబద్ధాలను ప్రజలు చూడలేకపోతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో రైతులు ఉద్యమించినప్పుడు అక్కడి ముఖ్యమంత్రి రైతులను ఎలా గౌరవించారో చూసి నేర్చుకోవాలన్నారు. ఉద్యమాలను అణిచివేసి మేమే గెలిచామనుకోవడం కేవలం ఆత్మ సంతృప్తి మాత్రమే మిగులుతుందని, భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లను అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోదని, వాటిని అమలు చేసినప్పుడే నమ్ముతామన్నారు. కేవలం ఎన్నికల కోసమే కాపు రిజర్వేషన్లు తీర్మానించి చేతులు దులుపుకున్నారన్నారు.

Similar News