రాష్ట్రంలో ఉంటే తనపైన లేకపోతే తనకు సన్నిహితులైన వాళ్లపైనే మీడియా అటెన్షన్ అంతా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారా? ప‌్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్ప యాత్రపై అటు మీడియా ఇటు ప్రజల దృష్టి పడకుండా ఆయన 'మేనేజ్' చేస్తున్నారా? తాను రాష్ట్రంలో లేని సమయంలో మీడియా కన్ను.. జగన్‌పై వెళ్లకుండా జనసేనానిని రంగంలోకి దించారా? అనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి యాదృశ్ఛికంగా జరుగుతాయో లేక ముందే పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయో తెలియదుగానీ..సందేహాలు వచ్చేలా.. అనుమానాలు రెట్టింపు చేసేలా ఉంటాయి. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య కూడా ఇలాంటి చిత్రమైన విషయం ఒకటి బయటపడింది.
పవన్ జనంలోకి వస్తున్నప్పుడు.....
ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు పవన్. మీడియా మేనేజ్‌మెంట్లో దిట్ట అయిన టీడీపీ అధినేత స్క్రిప్ట్ ప్రకారమే పవన్ సరైన సమయంలో యాత్రలు చేస్తున్నారనే వాళ్లు కూడా లేకపోలేదు. ఏపీలో ఇన్నాళ్లూ యాత్రలు, పర్యటనలతో ప్రజల్లోకి వెళ్లిన ఆయన.. ఇప్పుడు తెలంగాణలోనూ రాజకీయ యాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే అప్పుడే ఉండదేమో అని అంతా భావించారు. కానీ ఇలా ప్రకటించారో లేదో అలా యాత్రను ప్రారంభించేశారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. పవన్ రాజకీయ కార్యక్రమాల షెడ్యూల్ ను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తేలింది. ఏంటంటే.. ఏపీ సీఎం చంద్రబాబు దేశంలో లేనప్పుడు పవన్ జనంలోకి వస్తుండటం.
పవన్ ను రంగంలోకి దించారా?
దీని వెనకాల మతలబు లేకపోలేదట. అదేంటంటే.. రాష్ట్రంలో చంద్రబాబు లేని సమయంలో మీడియా ఫోకస్ ఇతర పార్టీల వైపు వెళ్లిపోవడం సహజం. అందులోనూ వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపైకి సహజంగానే ఫోకస్ చేస్తారు. అంతేగాక ఆయన పాదయాత్రకు కూడా అనూహ్యంగా ప్రజల మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో ఇటీవల సీఓటర్ సర్వే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మింగుడుపడని ఫలితాలే వచ్చాయి. ఇటు తెలంగాణలో ఒక్క కార్యకర్త కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో దావోస్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు.. ఆ నాలుగు రోజుల సమయంలో ఇతర పార్టీల నేతలకు ఏమాత్రం కొత్త అవకాశాలు దక్కకుండా ఉండేందుకు పవన్ రంగంలోకి దించారా? అని పలువురు అనుమానాలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఫోకస్ పవన్ పైనే....
ఇప్పుడు తెలంగాణలో ఆయన పర్యటన వల్ల టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏదీ లేకపోయినా మీడియా మొత్తం ఆయన పర్యటనపై ఫోకస్ చేయడం మాత్రం ఖాయం. పవన్ 22 నుంచి యాత్ర చేస్తుండగా చంద్రబాబు విదేశీ పర్యటన కూడా అదే తేదీల్లో ఉంది. దీంతో ఈ ప్రచారానికి మరింత ఊతం దొరుకుతోంది. గతంలోనూ పవన్ పలు సందర్భాల్లో చంద్రబాబు రాష్ట్రంలో లేనప్పుడే ట్వీట్లు చేయడమో, జనసేన కార్యక్రమాలు చేపట్డడమో చేశారని గుర్తు చేస్తున్నారు. మరి అసలు లోగుట్టు ఉంటే వారిద్దరికే తెలియాలి.