రాజకీయాల్లోకి రావడం అంటేనే ప్రస్తుత రోజుల్లో పెద్ద 'కళ'. ఇక, రాజకీయాల్లోకి వచ్చాక ఏ ఎండకా గొడుగు పడుతూ.. ఉండడం అదో 'కళ'. ఈ విషయంలో ఏ మాత్రం తొణుకు, బెణుకు ఉన్నా.. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత వీజీ కాదు! తలలు పండిన నిజాయీతీ పరులు కూడా రాజకీయాల్లోకి వచ్చాక 'ఎక్కడి మాట అక్కడే' అన్నట్టుగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణ మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన హయాంలో దేశంలో 2 జీ, బొగ్గు వంటి కీలకమైన కుంభకోణాలే కాకుండా అనేక అవినీతి పనులు వెలుగు చూశాయి. అయినా ఆయన తొణకను లేదు బెణకనూ లేదు. మౌనంగా ఉండిపోయారు.
ఎంతమేరకు మేలు చేస్తాయి...?
ఓ సందర్భంలో సాక్షాత్తూ.. సుప్రీం కోర్టు.. అవినీతి చేయడం ఎంత తప్పో.. అవినీతి చేస్తున్న వారిని చూస్తూ ఉండిపోవడమూ అంతే తప్పు! అని వ్యాఖ్యానించిందంటే.. పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది. కానీ, మన్మోహన్ లైట్‌గా తీసుకున్నారు. అయితే, ఆయన రాజకీయంగా హిట్టయ్యారు. పదేళ్లపాటు ప్రధానిగా ఈ దేశానికి వ్యవహరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. జనసేన పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయంగా ఆయనకు ఎంత మేరకు మేలు చేస్తాయి? ఎంత మేరకు లాభిస్తాయి? అనే కోణంలో ఆలోచించినప్పుడు ఆయనకు రాజకీయంగా ఇంకా మెలుకువలు తెలియలేదని స్పష్టం చేస్తున్నాయి. గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహా అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యపైనా విరుచుకుపడ్డాడు పవన్.
లౌక్యం లేకుండానే...
తాజాగా విశాఖ, పోలవరం, విజయవాడల్లో మాట్లాడుతూ.. లౌక్యం లేకుండానే కామెంట్లు చేశాడు. రాజకీయాల్లో ఉన్నవారు. రాజకీయాలు చేయాలనుకున్నవారు.. లౌక్యంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తప్ప.. మరొకరిని కాపాడే పరిస్థితి ఉండదు! కానీ, పవన్ చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఏమాత్రం లౌక్యం కనిపించడం లేదు. జగన్ గురించి మాట్లాడుతూ.. అనుభవం ఉంటేనే సీఎం సీటు అన్నాడు. మరి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవికి ఏ అనుభవం ఉందని జగన్ ఎదురు ప్రశ్నించాడు. ఇక, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి, కేంద్రానికి లెక్కలు చెప్పకపోతే ఎలా? అని బాబును ఉద్దేశించి ప్రశ్నించాడు పవన్.
ఆ ఎమ్మెల్యే గురించేనా?
దీనికి దీటుగా బాబు కూడా స్పందించారు. లెక్కలు చెప్పేది డబ్బులు ఇస్తేనే కదా? అంతా మన డబ్బుతోనే నిర్మాణాలు జరుగుతున్నప్పుడు లెక్కలు ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. ఇక, పోలవరం వివరాలు అన్నీ సైట్‌లో సిద్ధంగా ఉన్నప్పుడు శ్వేతపత్రంతో పనేంటని ఎదురు అడిగారు. ఇక, తాజాగా విజయవాడలో మాట్లాడిన పవన్.. తుపాకీతో కాల్చిన వాళ్లను ప్రభుత్వం రక్షిస్తోందని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. వాస్తవానికి అధికార టీడీపీకి చెందిన కీలక ఎమ్మెల్యేనే గతంలో ఇలా తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ వ్యాఖ్యానించాడా? లేదా? అనేదానికన్నా.. కూడా లౌక్యం లేకుండా పవన్ ఇలా కామెంట్లు చేయడమే వివాదానికి దారితీస్తోంది. వచ్చే 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగాలని భావిస్తున్నప్పుడు రాజకీయంగా చాలా లౌక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కానీ, పవన్‌లో ముక్కుసూటి వ్యవహారం తప్ప మరేమీ కనిపించడం లేదని చెబుతున్నారు.