ఇద్దరు ప్రాణమిత్రుల మధ్య కేసీఆర్ చిచ్చుపెట్టినట్లే కన్పిస్తోంది. సంధి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా ఉంది. ఈ ప్రాణస్నేహితులిద్దరూ ఇక కలిసే అవకాశమే లేదని అంటున్నారు. ఒకరు టీటీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. ఇద్దరూ మంచి స్నేహితులు. ఎంతగా... అంటే ఒకరి ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మరొకరు కుటుంబంతో సహా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర మంచి దోస్త్ లు. ఏం చేసినా ముగ్గురూ కలిసే చేసేవారు. ప్రాణానికి ప్రాణంగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీలో ఈ ముగ్గురూ నోరు విప్పారంటే... ప్రత్యర్థి పార్టీలకు దడ పుట్టాల్సిందే. పాయింట్... మీద పాయింట్ చెబుతూ వైరి పక్షాన్ని ఇరుకున పెట్టేస్తారు. అలాంటి స్నేహితుల మధ్య రగడ స్టార్ట్ అయింది. పరిటాల శ్రీరామ్ వివాహానికి వెళ్లిన కేసీఆర్ అక్కడ పయ్యావుల కేశవ్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో ఈ భేటీపై మీడియాలో అనేక రకమైన కథనాలు వచ్చాయి. కేసీఆర్ కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకే ఈ ఎత్తు వేశారని రేవంత్ అనుమానించారు.
బెడిసి కొట్టిన సంధి ప్రయత్నాలు.....
దీంతో రేవంత్ వెంటనే రంగంలోకి దిగి పయ్యావుల, పరిటాల, యనమల పై విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. పయ్యావుల కేశవ్, పరిటాల ఫ్యామిలీకి తెలంగాణలో కేసీఆర్ బీర్ల ఫ్యాక్టరీ ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. అయితే పరిటాల, యనమల రేవంత్ వ్యాఖ్యలపై స్పందించకున్నా... పయ్యావుల మాత్రం తీవ్రంగానే స్పందించారు. రేవంత్ కు బీర్ల ఫ్యాక్టరీకి, బార్ కి పెద్ద తేడా లేదన్నారు. రేవంత్ ఆరు నెలలుగా చేస్తున్న ఢిల్లీ పర్యటన సమాచారం తనవద్ద ఉందన్నారు. అవసరమైనప్పుడు బయటపెడతానన్నారు. కేసీఆర్ కుమార్తె తో రేవంత్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించిన విషయాన్ని కూడా చెప్పేశారు. అంటే ప్రాణమిత్రులుగా ఉన్నప్పుడు వారికి తెలిసిన నిజాలు ఇద్దరూ బయట పెట్టేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర రంగంలోకి దిగి ఇద్దరితో మాట్లాడారు. సంయమనం పాటించాలని, ఫ్రెండ్ షిప్ చెడిపోతుందని తెలిపారు. దీనికి పయ్యావుల స్నేహం విలువ తెలిసి ఉంటే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదన్నారు. రేవంత్ కూడా తాను ఏమీ కాని మాట అనలేదన్నారు. మొత్తం మీద నరేంద్ర చేసిన సంధి ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టినట్ల తెలిసింది. మొత్తం మీద ఒకప్పుడు ప్రాణమిత్రులుగా ఉండే ఈ ఇద్దరూ ఇప్పుడు కేసీఆర్ కారణంగా విడిపోవాల్సి వచ్చిందని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.