పోయిన చోటే జగన్ తిరిగి రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన కోవూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. కోవూరు నియోజకవర్గం అంటేనే నల్లపురెడ్డి కుటుంబానికి పట్టున్న ప్రాంతం. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుంచి వారి కుటుంబాన్ని కోవూరు ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. 1983,1985, 1989 ఎన్నికల్లో వరుసగా నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచారు. అయితే 2004లో కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున అభ్యర్థిగా పోటీ చేసిన ప్రసన్న తిరిగి విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ప్రసన్న 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ప్రసన్న గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేతిలో ఐదు వేల ఓట్ల తేడాతో ప్రసన్న ఓడిపోయారు.
కోవూరులో జగన్ పర్యటనకు....
నల్లపురెడ్డి కుటుంబానికి కోవూరు నియోజకవర్గంలో మంచి పట్టున్నా ఆయన ఎక్కువ సమయం అక్కడ కేటాయించకపోవడమే ప్రధాన సమస్య అన్నది స్థానికుల ఆరోపణ. గత ఎన్నికల్లో ఓటమ తర్వాత ప్రసన్న కొంత డీలా పడ్డారు. రాజకీయాలకు దూరంగా కూడా కొంతకాలం ఉన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఇచ్చినా సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. అయితే గత కొంతకాలంగా ప్రసన్న తిరిగి నియోజకవర్గ ప్రజలకు దగ్గరవుతున్నారని చెబుతున్నారు. ఎక్కువ సమయం కార్యకర్తల కోసం కేటాయిస్తూ, నియోజకవర్గ సమస్యలపై గళం విప్పుతుండటంతో ప్రసన్నకు ఈసారి గెలుపు అవకాశాలుంటాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కోవూరు నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పర్యటనకు మంచి స్పందన కన్పిస్తోంది.
జగన్ సంచలన నిర్ణయం....
కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెంలో జగన్ కు ఘన స్వాగతం లభించింది. జొన్నవాడ, పెనుబల్లి, సాల్మాన్ పురం తదితర ప్రాంతాల్లో జగన్ వెంట నడిచేందుకు వేలాది మంది తరలి వచ్చారు. ఆయన బుచ్చిరెడ్డి పాలెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదలను ఆదుకుంటానని జగన్ సంచలన ప్రకటన చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఆ కులంలోని పేదల అభివృద్ధికి పాటుపడతానాని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కేంద్రంలో మంత్రులుగా ఉండి బడ్జెట్ ను ఆమోదించిన తర్వాత చంద్రబాబు రాష్ట్రానికి ఎందుకు అన్యాయం జరిగిందని గింజుకుంటున్నారని ప్రశ్నించారు. అన్యాయం జరిగిందని భావించినప్పుడు మంత్రివర్గం నుంచి బయటకు రావాలే తప్ప.. హైడ్రామాలు ఆడకూడదని చురకలంటించారు. ఇదంతా పైకి డ్రామాయేనని, ఎన్నికలప్పుడే చంద్రబాబుకు అన్యాయం గుర్తుకు వస్తుందని ఎద్దేవాచేశారు. మొత్తం మీద కోవూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుండటంతో వైసీపీ నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కోవూరు నియోజకవర్గంలో ముగించుకుని జగన్ పాదయాత్ర ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గానికిచేరనుంది.