డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ పోలీసుల విచారణలో అడ్డం తిరిగుతున్నారు. తొలిరోజు విచారణలో హనీప్రీత్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిసింది. హనీప్రీత్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఆరు రోజుల కస్టడీకి కోరిన సిట్ అధికారులు తొలిరోజు విచారణ పూర్తి చేశారు. అయితే ఒక ప్రశ్నకు మాత్రం హనీప్రీత్ సమాధానం చెప్పారు. పోలీసుల కళ్లుగప్పి 38 రోజులు ఎక్కడెక్కడ తిరిగారన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది హనీప్రీత్. తాను నేపాల్ వెళ్లలేదని ఆమె చెప్పారు. తాను పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలోనే ఉన్నట్లు ఆమె స్పష్టంగా చెప్పారు. అంతేకాదు తాను వాట్సప్ లో అందరితో టచ్ లో ఉన్నానన్నారు. అంతేతప్ప తాను నేపాల్ కు వెళ్లలేదన్నారు. తాను బురఖాలోనే ఎక్కువగా బయట తిరిగానని పోలీసుల విచారణలో చెప్పారు. అయితే తనకు ఎవరు ఆశ్రయం కల్పించిందీ తొలిరోజు విచారణలో హనీ ప్రీత్ చెప్పలేదు. పోలీసు అధికారుల వేసిన ఈ ప్రశ్నకు హనీ దాట వేశారు. అందరూ టచ్ లో ఉన్నారని చెప్పారు.
తాను దత్తపుత్రికనే.....
అయితే తొలిరోజు పోలీసులు వేసిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేదు హనీప్రీత్. డేరాబాబాకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్న ప్రశ్నకూ హనీప్రీత్ సమాధానం దాటవేశారు. డేరా సచ్ఛ్ సౌధాలో ఉన్న ఖుర్బానీ గ్యాంగ్ గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. అయితే తనకు ఈ విషయంపై ఎటువంటి అవగాహన లేదన్నారు హనీప్రీత్. అంతేకాదు డేరా బాబా తీసిన సినిమాలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్నకూ సమాధానం తెలియదనే చెప్పారు హనీప్రీత్. డేరా బాబా తనకు తండ్రిలాంటి వారేనని, తాను దత్తపుత్రికనని ఆమె తెలిపారు. అక్కడ కొందరు ఆరోపిస్తున్నట్లు ఎలాంటి హత్యలు, అత్యాచారాలు జరగలేదనే హనీప్రీత్ చెప్పారు. తొలిరోజు విచారణ సమయం ముగియడంతో హనీప్రీత్ ను తిరిగి జైలుకు తరలించారు.