ప్రధాని విందు వివాదాస్పదం అయ్యిందే ...?

Update: 2017-11-30 03:30 GMT

భారత ప్రభుత్వం తరపున హైదరాబాద్ ఫలక్ నుమాలో ప్రధానమంత్రి ప్రపంచ పారిశ్రామికవేత్తల గౌరవార్ధం ఇచ్చిన విందు వివాదాస్పదంగా మారింది. ఈ విందు ఏర్పాటు చేసిన ప్రాంతంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి ట్విట్టర్ లో మండిపడ్డారు. ముస్లింల నిర్మాణాలపై విమర్శలు చేసే వారు అందులో విందు ఇవ్వడం పై ఆయన వ్యంగ్యాస్త్రాలు నేరుగా ప్రధాని మోడీపై సంధించారు. బిజెపి నేతలు ఒక పక్క తాజ్ వంటి కట్టడాలను సైతం విమర్శిస్తారని తిరిగి వాటిని ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నలు వేశారు. ఇప్పుడు ఒవైసి రాజేసిన ఈ నిప్పు ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆయన ట్విట్టర్ కామెంట్ పై ఇప్పటికే భిన్నమైన వాదనలు నెటిజెన్ల నడుమ సాగుతుంది.

ఏ చిన్న అవకాశం దొరికినా ...

మత ప్రాతిపదికన రాజకీయాలు చేసే ఎంఐఎం ఏ చిన్న అవకాశం దొరికినా బిజెపితో మాటల యుద్ధానికి కాలు దువ్వుతుంది. తాజాగా ఒవైసి మరోసారి ఈ అంశాన్ని రుజువు చేశారు. ఫలక్ నుమా లో మోడీ విందు అంశం తో ఎంఐఎం మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక పక్క టిఆర్ఎస్ తో సఖ్యత నెరుపుతూ మరోపక్క కేంద్రంలోని బిజెపి సర్కార్ పై విరుచుకుపడుతూ ఎంఐఎం రెండు రకాలుగా లబ్ది పొందుతుంది. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి దగ్గర కావడమే కాకుండా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను సాక్షాత్తు అసెంబ్లీలో వెనకేసుకు వస్తుంది ఎంఐఎం. తద్వారా తమకు కావలిసిన అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతుంది. మరోవైపు మోడీ వంటి వారిని విమర్శించడం ద్వారా తమ ఓటు బ్యాంక్ చెక్కుచెదరకుండా కాపాడుకుంటుంది ఎంఐఎం. మరి వారి వ్యూహం వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ఫలితం ఇస్తుందో కొద్దికాలం వేచి చూడాలి.

Similar News