ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనలో మార్పు

Update: 2017-11-25 02:09 GMT

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్‌‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 28న ప్రధాని మోడీ భాగ్యనగరానికి రానున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి మియాపూర్‌కు మోడీ హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. 2.15 గంటలకు మియాపూర్‌లో మెట్రోరైలు పైలాన్‌ను మోడీ ప్రారంభిస్తారు. 2.20 గంటలకు ప్రధాని మోడీ ప్రెజెంటేషన్, యాప్, బ్రోచర్ రిలీజ్ చేయనున్నారు. అనంతరం 2.30 గంటలకు మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోరైలులో మోడీ ప్రయాణిస్తారు. తిరిగి అదే మెట్రో రైలులో కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు వస్తారు. తర్వాత మియాపూర్ నుంచి హెచ్‌ఐసీసీకి హెలికాప్టర్‌లో వెళ్తారు.

భద్రత కట్టుదిట్టం....

అదే రోజు సాయంత్రం 4 గంటలకు హెచ్‌ఐసీసీలో ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు జరగనుంది. సదస్సులో ప్రధాని మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం హెచ్‌ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. ఇవాంకా, జీఈఎస్ ప్రతినిధులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని మోడీ విందు ఇవ్వనున్నారు. రాత్రి 8.45 గంటలకు విందు కార్యక్రమం ఉంటుంది. విందు తర్వాత శంషాబాద్ విమానాశ్రయం వెళ్లి.. అక్కడి నుంచి మోడీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో మరింత కట్టుదిట్టంగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.

Similar News