ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు అండగా నిలుస్తామని చెప్పారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు పారదర్శక విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. జగన్ ఫేస్ బుక్ లో జగన్ స్పీక్స్ పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. గ్రామ సచివాలయాల ద్వారా ఒకటిన్నర లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళతామన్నారు.
హోదాతోనే సాధ్యం.....
పెట్టుబడులు రావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా వల్లనే వస్తాయన్నారు జగన్. తన మొహం చూశో, చంద్రబాబు మొహం చూశో పారిశ్రామిక వేత్తలు వచ్చే అవకాశం లేదన్నారు. ప్రత్యేక హోదా వస్తే జీఎస్టీ, ఆదాయపు పన్ను లో మినహాయింపు వస్తుందన్నారు. అవి ఉంటేనే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారన్నారు. పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. కనీసం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నమే చేయకపోవడం విచారకరమన్నారు.
ఎన్ని పరిశ్రమలు వచ్చాయి...?
చంద్రబాబు 22 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినా ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలన్నారు. విదేశాలకు వెళ్లిన ప్రతి సారి పెట్టుబడుల కోసమే వెళుతున్నానని చెప్పే చంద్రబాబు ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేదని గుర్తు చేశారు. కేవలం నల్ల ధనాన్ని దాచుకోవడానికే ఆయన విదేశాలకు వెళుతున్నారన్నారు. చంద్రబాబు చెప్పేవన్ని అబద్ధాలని ఈ నాలుగేళ్ల పర్యటనలతో తేలిపోయిందన్నారు. విదేశాలకు వెళ్లి చేసే ప్రయత్నంలో పదిశాతం మోడీ వద్దకు వెళ్లి చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు.