వెంకయ్యనాయుడు కు ప్రజలు చాలా మంచి వాళ్లు. కానీ ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకులు, ప్రత్యేకించి తమ అధికార కూటమికి విపక్షాలకు చెందిన నాయకులు అయితే చాలా చెడ్డవాళ్లు అనే అభిప్రాయాలు స్థిరపడిపోయినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆయన మంచి చెడుల ప్రస్తావన తేకుండా.. నాయకుల కంటె ప్రజలు చాలా తెలివైన వాళ్లు అంటూ కితాబులు ఇస్తున్నారు. విశాఖలో సీ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంటే.. ఆ వేదిక మీదనుంచి అసందర్భంగా ఇలా ప్రజలను కీర్తించారు వెంకయ్యనాయుడు.
ఆయన వ్యాఖ్యలు గమనిస్తే ఆయనలోని ఆవేదనకు చిహ్నాలే అనిపిస్తోంది. అవును మరి.. అవి ప్రజలకు కితాబు ఇచ్చినట్లు లేదు. వారి అమాయకత్వానికి , నోట్లో నాలుక లేని మంచి తనానికి జాలి చూపించినట్లుగా ఉంది.
ప్రత్యేకహోదా గానీ, రాష్ట్ర ప్రయోజనాలను గానీ సాధించడంలో వెంకయ్య విఫలం అయ్యారంటూ విపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే జనానికి నేరుగా పెద్ద అవకాశం లేదు గనుక.. వారి గళం వినిపించడం లేదు. తాను రాష్ట్రం కోసం ఎంత సాధించానో నాయకులకు అర్థం కాలేదు గానీ.. ప్రజలు చక్కగా అర్థం చేసుకున్నారు అన్నట్లుగా.. వెంకయ్యనాయుడు.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. అయినా వెంకయ్యగారూ మీరు గుర్తించాల్సింది ఒకటుంది. ప్రజలు ఇప్పుడు మౌనంగా ఉన్నారు గనుక.. మంచివాళ్లలా కనిపిస్తున్నారు. కానీ రేపు ఎన్నికల వేళ వారి సత్తా ఏమిటో తప్పక చూపిస్తారు.