ప్రకాశం తమ్ముళ్లు ఎప్పుడు అంతేనా ...?

Update: 2017-12-01 07:30 GMT

కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వీరిద్దరి నడుమ ప్రకాశం జిల్లాలోనే కాదు అమరావతి లో సైతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంటుకుంటుంది. తాజాగా ఏపీ సచివాలయంలో మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఇరువురు నేతలు కొట్టుకునేంత పని చేశారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకునే యుద్ధానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అని కేకలు, వాగ్వాదాలు షరా మామూలే అనుకోండి. అయితే వీరి ఫైటింగ్ చూసి హడలిపోవడం మంత్రులు శిద్ధారాఘవరావు, నారాయణ, పరిటాల సునీతల వంతైంది.

అసలు ఎందుకొచ్చింది గొడవ ...

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అద్దంకి పోరు మొదలైంది వైసిపి నుంచి టిడిపిలోకి గొట్టిపాటి రవికుమార్ వచ్చాక. అంతకుముందు కూడా అనేక దశాబ్దాలుగా గొట్టిపాటి, కరణం కుటుంబాల నడుమ వున్న రాజకీయ వైరుధ్యాలు నడిచేవి. ఈ కారణంగా ఇరు వర్గాలు కత్తులు నూరుకుంటూనే వున్నాయి. వైసిపి నుంచి టిడిపి లోకి వచ్చిన గొట్టిపాటి రవికుమార్ లోకేష్ ఆశీస్సులతో నియోజకవర్గంలో చక్రం తిప్పడం, పార్టీలో సీనియర్ అయిన కరణం బలరాం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం ఇటీవల చాలా కాలంగా నడుస్తుంది. తాజాగా వీరిద్దరూ జిల్లా సమీక్షలో పాల్గొన్నప్పుడు డీసీసీబీ ఛైర్మన్ నియామకంపై రగడ మొదలైంది. ఇద్దరి నడుమ చిలికి చిలికి గాలివానగా మొదలైన వాగ్వాదం కొట్టుకునే స్థాయికి వెళ్లడంతో మంత్రులు, ఎమ్యెల్యేలు వీరిని విడతీయడానికి నానా పాట్లు పడ్డారు. చివరికి గొట్టిపాటి సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అబ్బే గొడవలేమి లేవంటూ ...

సమావేశంలో ఫైట్ ముగిశాకా బయటకు వచ్చిన మంత్రులు శిద్ధారాఘవరావు, నారాయణ అబ్బే లోపలేమి జరగలేదని వివాదం దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే అంతకు ముందు గొట్టిపాటి రవికుమార్ మాత్రం మార్కెట్ కమిటీ కోసం చిన్న గొడవ అంటూ అసలు విషయం ఏమీలేదంటూనే చెప్పేయడం విశేషం.

Similar News