పోలీసులు వంద కోట్లు వసూలు చేశారే...!

Update: 2017-12-23 00:30 GMT

సైబరాబాద్ కమిషనరేట్.. ఈఏడాది రికార్డు స్థాయిలో జరిమానాలు విధించి గిన్నీస్ రికార్డు బద్ధలు కొట్టింది. బందోబస్తు కన్నా చలానానే ముఖ్యమంటూ దూసుకు పోయిన కమిషనరేట్ 2017లో అక్షరాల 96 కోట్ల 32లక్షల రూపాయల జరిమానాను వాహన చోదకులకు విధించింది. ఇప్పటికే అందులో 30 కోట్ల 21 లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసి తమ ఖాతాలో జమ చేసుకుంది. వాహనాల చలానా అమౌంటే కాదు నేరాల లిస్టును కూడా ఈ సంవత్సరం అమాంతం పెంచేసింది. రికార్డుల మీద రికార్డులు కైవసం చేసుకున్న సైబరాబాద్ కమిషనరేట్ పై ఓ రిపోర్ట్..

చాలా కాస్ట్ లీ గురూ...

సైబరాబాద్ కమిషనరేట్ ఒకప్పుడు దీని విస్తీర్ణం చాలా పెద్దది. సిబ్బంది తక్కువగా ఉండటంతో రెండుగా చీలిపోయిన తరువాత మూడువేల 644 కిలోమీటర్లకు కుదించుకుపోయింది. 36 లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లు, 11 ట్రాఫిక్ పిఎస్ లు, 3 సిసిసఎస్ లతో పాటు మహిళా పోలీసు స్టేషన్ తో ముందుకు సాగుతోంది. 42 లక్షల జనాభా ఉన్న ఈ కమిషనరేట్ లో పని చేసే పోలీస్ సిబ్బంది మూడువేల మంది. అంతే కాదు 700 ఐటీ కంపెనీలు, 6500 పరిశ్రమలు, 7 యూనివర్సీటీలు, 12 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, మూడు స్టేడియంలు, 65 ఇంజనీరింగ్, 3 మెడికల్ కాలేజీలు, 274 మహిళా హాస్టల్స్, హోటల్స్, పబ్స్, రిసార్ట్ ఉన్న అత్యంత ఖరీదైన కమిషనరేట్ సైబరాబాద్ అనే చెప్పుకోవచ్చు.

వాహనాల జరిమానాలు 96 కోట్లు...

ఎంత ఖరీదైనదో ఇక్కడ జరిమానాలు కూడా అధికారులు అంతే ఖరీదు స్థాయిలో వసూలు చేస్తారు. ఈ ఏడాది 2017లో వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు విధించిన చలానా అక్షరాలా 96 కోట్ల 32 లక్షలు. అందులో 30 కోట్ల 21లక్షల రూపాయలు వసూలు చేసి వారి ఖాతాలో జమ కూడా చేసుకున్నారు. కోట్లాది రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేసిందంటే సైబరాబాద్ ఎంత ఖరీదైనదో చలానా చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఈ సారి క్రైం రేట్ లో కూడా సైబరాబాద్ రికార్డు బద్ధలు కొట్టింది. 58 మర్డర్లు, 86 చైన్ స్నాచింగ్ లు, మూడువేల 517 రోడ్డు ప్రమదాలు చోటు చేసుకున్నాయి. అందులో 740 మంది చనిపోయారు. ఇక పెట్టీ కేసులు 79, పేకాట కేసులు 192, 396 ఎక్సైజ్ కేసులు నమోదు చేశారు. వీటితో పాటుగా ఇసుక మాఫియా 63 కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు కూడా చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 13వేల 553 కేసులు నమోదు చేసి మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు.

నేరాల సంఖ్య కూడా ఎక్కువే...

2016 తరహాలాగానే 2017లో కూడా షీటీమ్స్ 330 డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఆకతాయిలు, రోమియోల భరతం పట్టారు. అందులో 320 కేసులు నమోదు చేశారు. చాలీ చాలని సిబ్బంది ఉన్నాకూడా ఎనిమిది మెట్రో స్టేషన్లకు ప్రత్యేక బందోబస్తు కోసం సిబ్బందిని నియమించడం జరిగిందని కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. శివారు ప్రాంతాల్లో దాడులు చేసి వంద గుట్కా కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్ వేర్ కంపెనీల విషయంలో ఆయా యజమానులతో కలిసి మూడంచెల భద్రత కల్పించామని, మహిళా ఉద్యోగినుల కోసం షీ షటిల్స్ ఎంతగానే ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రతి కేసుకి ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితులకు అండగా నిలబడ్డ ఘనత తమ సైబరాబాద్ పోలీసులకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో సిబ్బంది సంఖ్యను పెంపొందించుకోవడమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువవుతామన్నారు. మహిళలు, యువతుల కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్ స్థాయిని మరింత పెంచి పటిష్టమైన చర్యలు చేపడతామని చెప్పారు. మొత్తానికి సైబరాబాద్ కమిషనరేట్ వసూలు చేసిన జరిమానా చూస్తే బందోబస్తులు, నేరాల అడ్డుకట్ట కన్నా చలానా వసూళ్లపైనే ఎక్కువ శ్రద్ధ చూపినట్లు అర్థమైంది

Similar News