ఒరిస్సా పరిధిలోని మల్కన్ గిరి అడవుల్లో సోమవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నదనే పక్కా సమాచారం అందడంతో కూంబింగ్ నిర్వహించిన పోలీసులు మావోయిస్టులను చుట్టు ముట్టి మట్టు పెట్టారు. దేశంలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో ఒకటిగా పేర్కొంటున్న ఈ కాల్పుల్లో 21 మంది మావోయిస్టులు మరణించినట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఇద్దరు గ్రేహౌండ్ పోలీసులు కూడా నక్సలైట్ల కాల్పుల్లో గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా విశాఖ పట్టణానికి చికిత్స నిమిత్తం తరలించారు.
మల్కన్‌గిరి సమీపంలోని అడవుల్లో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉన్నట్లు ఏపీ డీజీపీ ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేత ఉదయ్‌తో సహా ఆయన దళం మొత్తం ఈ ఎన్ కౌంటర్ లో హతమైనట్లుగా భావిస్తున్నారు. ఏవోబీ సెక్రటరీ గణేష్ మాత్రం తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ స్థలాన్ని పరిశీలించడానికి ఏపీ డీజీపీ సాంబశివరావు హైదరాబాదునుంచి విశాఖపట్టణానికి వెళ్లారు.
తప్పించుకున్న మావోయిస్టు ఏవోబీ కార్యదర్శి గణేశ్ కీలకమైన నాయకుల్లో ఒకరు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మావోయిస్టులతో జరిగిన చర్చలలో కూడా పాల్గొన్నారు.
అయితే ఏపీ డీజీపీ మాత్రం.. ఎన్‌కౌంటర్ లో ఇంకా అగ్రనేతలు ఎవరెవరు మృతిచెందారో సమాచారం పక్కాగా తెలియదు అని... సంఘటన స్థలానికి చేరుకోవడానికి పది గంటల సమయం పడుతుందని అంటున్నారు.