పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ పై నమ్మకం లేని ఏపీ సర్కార్ కొత్తగా టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే టెండర్ల నిబంధనను పాటించలేదని కేంద్ర జలవనరుల శాఖ దానికి అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కొత్తగా టెండర్లు పిలిస్తే అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని భావించిన కేంద్ర జలవనరుల శాఖ ఇందుకు ససేమిరా అంది. దీంతో పోలవరం ప్రాజెక్టు గందరగోళంలో పడింది. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు కేంద్ర జలవనరుల శాఖ త్రిసభ్య కమిటీని నియమించింది. త్రిసభ్య కమిటీ రెండు రోజులుగా విజయవాడలో పర్యటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రధాన కాంట్రాక్టర్ తోనూ త్రిసభ్య కమిటీ చర్చించింది.
కన్సార్టియం ద్వారా.....
అయితే ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణం పనులు వేగవంతం చేయాలంటే ట్రాన్స్ ట్రాయ్ ఒక్కరితో సాధ్యం కాదని భావించిన చంద్రబాబు కన్సార్టియం ద్వారా కాంట్రాక్టర్లను దింపాలన్న ప్రతిపాదనను త్రిసభ్య కమిటీ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ కన్సార్టియంలో బడా కంపెనీలు ప్రధాన కాంట్రాక్టర్ కు పనులు వేగవంతంలో సహకరిస్తాయి. కొత్త కాంట్రాక్టర్లను భాగస్వామ్యులు చేయాలంటే కన్సార్టియం ఒక్కటే మేలన్నది చంద్రబాబు నిర్ణయం. సోమవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు స్పిల్ వే, స్పిల్ ఛానల్, మెయిన్ డ్యాం పనులు వేగవంతంగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే కన్సార్టియం ద్వారా కాంట్రాక్టర్లను రంగంలోకి దించి పనులను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ పోలవరాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా కన్సార్టియం ప్రతిపాదనను గడ్కరీ ముందు చంద్రబాబు ఉంచే అవకాశముంది.