పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి. అదిగో 2018 ఇదిగో 2019 అంటూ రెండు ప్రభుత్వాలు ప్రాజెక్ట్ పూర్తి పై గాలి కబుర్లు చెబుతున్నట్లు స్పష్టం అవుతుందంటున్నారు నిపుణులు. ఇప్పటివరకు పలు ముఖ్యమైన కట్టడాలకు సంబంధించి ఆకృతులు ( డిజైన్స్ ) ఇవ్వకపోవడంతో ప్రాజెక్ట్ పనుల వేగాన్ని అంచనా వేయొచ్చు. కాఫర్ డ్యామ్ పై ఇప్పటి వరకు ఆలస్యం చేస్తూ వచ్చిన కేంద్రం నెలరోజుల పాటు ఈ అంశంపై చర్చల పేరుతో విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఎట్టకేలకు ఆమోదం అని తాజాగా తెలిపింది. గోదావరికి వరదలు లేని కీలక సమయంలో నిర్మాణం జోరుగా సాగాలి. అలాంటిది ఆ సమయంలో డిజైన్లు , నిర్మాణాలపై కమిటీలు చర్చలు వేస్తూ పోతే 2019 కి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేది అనుమానమే అంటున్నారు మేధావులు.
పరిశీలన పర్యవేక్షణ , ప్రచారం ....
ప్రాజెక్ట్ ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయి ని బ్యాంక్ డిఫాల్టర్ గా గుర్తించాలనే విధంగా చర్యలు ప్రారంభించడంతో పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం 60 సి కింద పిలవాలనుకున్న టెండర్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంక్ బ్లాక్ లిస్ట్ లో వున్నా పోలవరం పనులను మూడున్నరేళ్లుగా ఆ కాంట్రాక్టర్ తోనే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయించిందో ఎవరికి అంతుపట్టడం లేదు. అలాగే ఆ కాంట్రాక్టర్ వల్ల పనులు ఆలస్యమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం అది తప్పుల తడకగా ఉండటం గుర్తించిన కేంద్రం మళ్ళీ విషయాన్ని మొదటికి తెచ్చింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఎవరికి నచ్చిన విధంగా వారు ఏపీ ప్రజలకు గుండెకాయవంటి పోలవరం ప్రాజెక్ట్ తో బంతాట ఆడుకుంటున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.