తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కంపెనీయే పోలవరం జాప్యానికి అసలు కారణమని తెలుస్తోంది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాయడం వల్లనే పోలవరం టెండర్లను నిలిపేయాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించినట్లు చెబుతున్నారు. పోలవరం టెండర్లు ట్రాన్స్ ట్రాయ్ కు దక్కగా, పనుల్లో జాప్యం జరుగుతుందని భావించిన చంద్రబాబు సర్కార్ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని తప్పించింది. ఈ మేరకు ఆ కంపెనీకి 60 సి క్లాజు కింద తప్పించింది. దీనిపై ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ అనేక అభ్యంతరాలు లేవనెత్తినా బాబు సర్కార్ పట్టించుకోలేదు. కొత్త కాంట్రాక్టర్ ను పిలవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎంపీ రాయపాటి ఢిల్లీలో బలమైన లాబీయింగ్ చేసి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కాకుండా కొత్త వారికి అప్పగించడంపై అడ్డుపుల్ల వేశారు.
ట్రాన్స్ ట్రాయ్ లేఖ రాసినందుకే.....
అయితే ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. టెండర్లకు 45 రోజుల సమయం ఇవ్వాల్సి ఉండగా ఆ నిబంధనను బేఖాతరు చేసింది. వెబ్ సైట్ లో కూడా టెండర్ల విషయాన్ని అందుబాటులో ఉంచలేదు. దీంతో గత నెల 21వ తేదీన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది. తమకు తెలియకుండా స్పిల్ వే, స్పిల్ ఛానల్ కాంట్రాక్టు పనులకు టెండర్లను పిలవడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తమకు నోటీసులు ఇచ్చినా అందుకు వివరాలు సంపూర్ణంగా వివరించామని, అసలు తమకు ప్రాజెక్టు నిర్మాణానికి భూమిని అప్పగించడం విషయంలోనే ప్రభుత్వం జాప్యం చేసిందని ఘాటుగా లేఖ రాసింది. దీంతోనే కేంద్ర జలవనరుల శాఖ టెండర్లు నిలిపేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పోలవరం నిర్మాణంలో చంద్రబాబు కేంద్రంపై ఆరోపణలు చేయడం కంటే సొంత పార్టీ ఎంపీకి చెందిన సంస్థను తొలుత కట్టడి చేయాలంటున్నాయి విపక్షాలు.