పోలవరం యాక్షన్ ప్లాన్ వర్క్ అవుట్ కాదా?

Update: 2018-01-18 02:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పాత కాంట్రాక్టర్ మార్పు వ్యవహారం గందరగోళం గా మారింది. మారిస్తే అదనపు ఖర్చు భరించేందుకు సిద్ధంగా లేమని చెప్పిన కేంద్రం తరువాత ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయికి కొంత గడువు ఇచ్చి పనులు చేయమంది. ఈలోగా బ్యాంక్ లు సదరు కాంట్రాక్టర్ పై ఐపి సంస్థగా ప్రకటించాలని కోర్ట్ కి ఎక్కింది. మరోవైపు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు విధులను బహిష్కరించారు. దాంతో కీలకమైన ప్రాజెక్ట్ నిర్మాణం చతికిలపడింది. కేంద్రం ఈ పరిణామాలను గమనించి ఏపీ సర్కార్ గతంలో పిలిచిన టెండర్లు దాఖలు చేసిన వారిని లైన్లో పెట్టాలని అనుమతి ఇచ్చేసింది.

అక్కడే మెలిక పెట్టిన కేంద్రం ....

మీరు చెప్పిన వన్ని ఒకే అయితే పాతకంట్రాక్టర్ కు ఇస్తామన్న మొత్తానికే పని పూర్తి కావాలని తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ అంశాన్ని ఏపీ సీఎం కూడా స్పష్టం చేశారు. పాత రేటుకే కొత్త కాంట్రాక్టర్ లు పనులు చేస్తారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. దాంతో ధర విషయం లోనే ప్రతిష్టంభన కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అందువల్లే ప్రాజెక్ట్ ముందుకు సాగకుండా కేంద్రం అడ్డు చక్రం వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇందంతా బానే వున్నా పాత ధరకు పెరిగిన అంచనా వ్యయం నడుమ తేడా భారీగానే వుంది.

ఏపీ ప్రజలపైనే భారం వేస్తారా ..?

వందశాతం కేంద్రమే భరించాలిసిన జాతీయ ప్రాజెక్ట్ లో ఇప్పుడు రాష్ట్రం భరించేందుకు సిద్ధమయ్యే ఇలా నిర్ణయానికి వచ్చిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే జరిగితే తీవ్ర ఆర్థికలోటు తో వున్న ఏపీకి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారుతుంది.చంద్రబాబు ఇప్పటివరకు 2018 కి పోలవరం కు గ్రావిటీ పై నీళ్లు అంటూ చెప్పుకొచ్చారు. కానీ గత మూడు నెలలుగా కేంద్రం రాష్ట్రం నడుమ నడుస్తున్న అంతర్గత యుద్ధం తో ఇప్పుడు 2019 కి ప్రాజెక్ట్ పూర్తి అంటూ మాట మార్చారు. రాబోయే ఎన్నికలకు పోలవరం పూర్తి చేసి గ్రావిటీపై నీరు ఇవ్వడం టిడిపి సర్కార్ కి ప్రతిష్టాత్మకం పోలవరం, అమరావతిని చూపించి జనంలో ఓట్లు అడుగుదామని బాబు ఆలోచన. కానీ ఆయన యాక్షన్ ప్లాన్ ఏ మాత్రం వర్క్ అవుట్ అయ్యేలా పరిస్థితులు ఆయన పై పగబట్టాయి. దీనికి తోడు పోలవరం లో భారీ అవినీతి అంటూ ఒక సామాన్యుడి లేఖను పిఎంఓ సీరియస్ గా తీసుకుని ఫిర్యాదు దారుడికి సంతృప్తి పరిచేలా సమాధానం ఇవ్వాలని విచారణ జరపాలని ప్రాజెక్ట్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిణామాలు ఊహించని చంద్రబాబు ఒక అడుగు వెనక్కు తగ్గి కేంద్రం చెప్పిన దానికి తానా తందానా అనక తప్పని పరిస్థితి తప్పడం లేదు.

Similar News