పోలవరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు 2544 కోట్లు మంజూరు చేయాలంటూ ఇచ్చిన బిల్లులపై కొర్రీలు కేంద్రం వేయనుందా ? అవుననే అంటున్నారు నిపుణులు. పోలవరం కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఎత్తిపోతల పధకాలను పట్టిసీమ, పురుషోత్తమపట్నం గా చూపి సుమారు 3600 కోట్ల రూపాయలు వెచ్చించింది రాష్ట్ర సర్కార్. కాగితాల్లో మాత్రం పోలవరం ఖర్చు గా చూపడం వల్లే ప్రాజెక్ట్ కి ప్రతిష్టంభన ఎదురైనట్లు తెలుస్తుంది. సరిగ్గా ఈ అంశం దగ్గరే పోలవరం అధారిటీ, కేంద్ర జలవనరుల శాఖా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం తెలపడంతో బిల్లులు పంపడానికి ఇన్నాళ్లు ఆలస్యం చేస్తూ వచ్చారని అంటున్నారు. ఈ కాలువలకు అయిన ఖర్చును కేంద్రం నుంచి రాబట్టాలంటే విపక్షాలనుంచి, ప్రజలనుంచి వత్తిడి తేవాలని తద్వారా కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యేలా చేయాలన్న ప్లాన్ తో ఇదంతా నడిచిందంటున్నారు.
ఆ..రెండు ఎత్తిపోతల ఖర్చుతో ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది ..
పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చును రాష్ట్ర సర్కార్ పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణంలో ఖర్చు చేసి ఉంటే ఈ పాటికి దీని నిర్మాణం పూర్తి అయ్యి 2018 మార్చి నాటికి గ్రావిటీ మీద నీరు వచ్చేది. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయి 4000 కోట్ల రూపాయలకు టెండర్ వేసింది. ఏపీ సర్కార్ తాత్కాలిక ప్రాజెక్ట్ లపై 3600 కోట్ల రూపాయలు ఖర్చు చూపించడం వల్లే కీలకమైన పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయ్యిందన్నది విమర్శకుల మాట. వాస్తవానికి విపక్షాలు, ప్రజా సంఘాలు, రైతులు సైతం ఇదే అంశాన్ని పదే పదే చెప్పినా ముడుపులకోసమే శాస్వీత ప్రాజెక్ట్ పక్కన పెట్టి తాత్కాలిక ప్రాజెక్ట్ లను పంపులు తగిలించి టిడిపి సర్కార్ ప్రచారం సాగించడం అసలుకే ఎసరు తెచ్చింది. ఈ తాత్కాలిక ఎత్తిపోతల సొమ్ము కేంద్రం ఇచ్చేందుకు ససేమిరా అనడంతో రాజకీయ ఎత్తుగడలకు చంద్రబాబు తెరతీశారన్న ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా రాష్ట్రం సమర్పించిన బిల్లులపై కేంద్రం చేయబోయే రంధ్రాన్వేషణలో మరిన్ని లొసుగులు బయటపడతాయంటున్నారు. మరి ఏమి జరగనుందో చూడాలి.