పోలవరం ప్రాజెక్ట్ లో టెండర్ల వివాదం ఢిల్లీ లో పంచాయతీకి దారి తీసింది. దాంతో ఏపీ జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమ ఢిల్లీ హుటాహుటిన బయల్దేరాలిసివచ్చింది. కేంద్ర జల మంత్రి నితిన్ గడ్కరీ ని ఏపీ కాంగ్రెస్ బృందం కలుస్తుందన్న సమాచారం కూడా టిడిపి సర్కార్ లో గుబులు రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో పోగొట్టుకున్న పరువును తిరిగి గౌరవంగా నిలుపుకునే ప్రయత్నాలు చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరీ ఇంత దారుణమైన దోపిడీ నా ...
టిడిపి సర్కార్ పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం పేరుతో పత్రికల్లో ఒకలా.... వెబ్ సైట్ లో మరోలా, పత్రికల్లో ఇచ్చిన తేదీలు వేరు వెబ్ సైట్ లో ఉంచిన తేదీలు వేరు, పత్రికల్లో చూపిన సొమ్ముకి , వెబ్సైట్ లో చెప్పిన లెక్కకు వందకోట్లకు పైగా తేడా రావడాన్ని అంతా తప్పు పడుతున్నారు. ఈ ఒక్క వ్యవహారం క్రిస్టల్ క్లియర్ గా అందరికి తేటతెల్లం కావడంతో ఇప్పటివరకు ఏపీ సీఎం పోలవరం పై చేసిన చేసుకుంటున్న ప్రచారం బూడిదలో పోసిన పన్నీరే అయ్యిందన్న వ్యాఖ్యలు టిడిపి వర్గాల నుంచే వినవస్తున్నాయి. రాబోయేవి కీలకమైన ఎన్నికల రోజులు కావడంతో ఇలాంటి పొరపాట్లకు ప్రజలముందు దోషులుగా నిలబడాలిసి వస్తుందని కేంద్రం ముందు చేతులు కట్టుకునే పరిస్థితి ని కొత్త టెండర్లు తెచ్చి పెట్టాయన్న ఆందోళన పెరిగిపోతుంది.
పోలవరాన్ని సందర్శించనున్న మరో బృందం ...
ఈ వివాదాలు ఇలా ఉండగా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ బృందం సభ్యులు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. ఆరుగురు సభ్యులు గల ఈ బృందం ప్రాజెక్ట్ లో భాగమైన పవర్ ప్రాజెక్ట్ పై అంచనాలు రూపొందించడంతో బాటు రాష్ట్రం చెప్పే లెక్కలను పరిశీలించనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 960 మెగావాట్ల విధ్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉండటం తో డ్యామ్ నిర్మాణంలో జల విధ్యుత్ కేంద్ర నిర్మాణం కీలకం కానుంది.
మరికొన్ని తప్పులు ఎత్తి చూపి ....
పోలవరం నిర్మాణం లో మరికొన్ని తప్పులు ఎత్తిచూపి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో తాము నిర్మాణం చేపడతామని కేంద్రం ముందుకు వస్తుందని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. రాబోయే ఎన్నికలకు పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన అంశం గా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని టిడిపి భావించినట్లే పొత్తు లేని పక్షంలో పసుపు పార్టీ చేసిన తప్పులు ఎత్తి చూపాలని నిర్మాణ సారధ్యం కేంద్రమే వహిస్తుందని ప్రాజెక్ట్ క్రెడిట్ కమల దళం తీసుకునే ఎత్తుగడలో ఉందంటున్నారు.