పోలవరం పై ఆ ప్రశ్నలకు జావాబు లేదే ...?

Update: 2017-12-14 03:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సందిగ్దతపై కేంద్రం తాజాగా భరోసా ప్రకటించడం రాష్ట్రం అదే చెప్పడం శుభ పరిణామాలే. కేంద్ర జలవనరుల శాఖామంత్రి గడ్కరీ తో చంద్రబాబు జరిపిన విస్తృత స్థాయి సమీక్షలో అనేక కీలక అంశాలపై క్లారిటీ లభించింది. అయినప్పటికీ కొన్ని ప్రధాన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు ఇవ్వకపోవడం విశేషం. పోలవరం నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని గడ్కరీ స్పష్టం చేస్తూ దీనిపై మీడియా అనవసర అల్లరి చేస్తుందని కూడా వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ ను గడ్కరీ పూర్తి చేయకపోతే ఎవరూ చేయలేరన్నారు. ప్రతి 15 రోజులకోసారి గడ్కరీ రాజమండ్రి విచ్చేస్తారని, తానూ వారం వారం సోమవారం పోలవరం కంటిన్యూ చేస్తా అని చెప్పుకొచ్చారు. ఇదంతా బానే వుంది. కానీ కొన్ని అంశాలపై ఇప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

పెరిగిన అంచనా వ్యయం సంగతో...

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందా లేదా ప్రశ్నార్ధకంగా ఉందంటూ ఏపీలో అధికారపక్షం తప్ప అన్ని పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రం పెరిగిన అంచనాల ప్రకారం 58 వేలకోట్ల రూపాయల అంశం తాజా సమావేశంలో తేల్చలేదు. అదేవిధంగా ఏపీ సీఎం 2014 ధరలతో కూడిన డిపిఆర్ ఇవ్వడం దీనివల్ల అదనపు వ్యయం ఎవరు భరిస్తారు అన్నది సందేహంగా నిలుస్తుంది. శ్వేతపత్రం పై అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నా దీనిపై మాత్రం ఏపీ సర్కార్ ఏ మాత్రం సిద్ధం కాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. పోలవరం ఖర్చు కేంద్రమే భరించాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు న్యాయస్థానం లో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయకపోవడం కూడా పెరిగిన ఖర్చు పై కేంద్రాన్ని రాష్ట్రం నిలదీయలేని తనాన్ని సూచిస్తుంది. ఇక లోయర్ కాఫర్ డ్యామ్ కి ఒకే అని కేంద్రం చెప్పినా ఎగువ కాఫర్ డ్యామ్ కి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం దీనిపై ఏపీ సర్కార్ గట్టిగా అడగలేకపోవడానికి కారణాలు ఎవరికి అంతుచిక్కడం లేదు. 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి కాకుండా 2018 కి గ్రావిటీ ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలరన్న సందేహాలను రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లు సైతం వ్యక్తం చేస్తున్నారు.

Similar News