పోలవరం పునాది సరిగానే వేస్తున్నారా ...?

Update: 2017-10-29 09:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజల జీవనాడి. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే రాష్ట్రమంతా సస్యశ్యామలమే అవుతుంది. ఉత్తరాంధ్ర , రాయలసీమల్లో సిరులు పండుతాయి. అలాంటి బృహత్తర ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై ఇటీవల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు సీనియర్. తాజాగా మీడియా తో చిట్ చాట్ లో అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ సైతం ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేశారు. హడావిడి పనులు చేసి గోదావరి జిల్లాల కొంప మునగకుండా చూడాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ హెచ్చరిస్తున్నారు.

కాఫర్ డ్యామ్ నిర్మాణంలో తేడా చేస్తున్నారు ...?

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కాఫర్ డ్యామ్ కీలకమైనది. అది నిర్మితం అయ్యే కింది భాగంలో ఇసుక పొరల మధ్య గ్యాప్ లేకుండా ఇంజనీరింగ్ నిపుణులు అత్యంత శ్రద్ధ వహించాలని హర్ష కుమార్ అంటున్నారు. ఒక జియాలజీ చదివిన వాడిగా తాను చెబుతున్నా అని అక్కడ చేయాలిసిన పని చేయకుండా ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డ్యామ్ అడుగు భాగంలో నమోదు అయ్యే బరువును లెక్కవేసి అడుగున వున్న ఇసుక పొరల నడుమ వున్న ఖాళీలను భర్తీ చేస్తూ నిర్మించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పోలవరం పై తగిన శ్రద్ధతో హడావిడి లేకుండా నిర్మాణం సాగించాలన్నారు మాజీ ఎంపీ. లేని పక్షంలో ఉభయగోదావరి ముఖ్యంగా రాజమండ్రి , కోనసీమ కాకినాడ కనుమరుగు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలవరం క్రెడిట్ వైఎస్ ఆర్ దే ...

పోలవరం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం భవిష్యత్తులో పూర్తి చేసినా ఆ క్రెడిట్ మాత్రం రాజశేఖర రెడ్డి కె దక్కుతుందన్నారు హర్ష కుమార్. 1996 లో తెలుగుదేశం శాసనసభ్యుడు వడ్డీ వీరభద్రరావు ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేస్తే టిడిపి ఎందుకు ఆనాడే నిర్మాణానికి పూనుకోలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 9 ఏళ్లపాటు సీఎం గా వున్నా చేయని పని రాజశేఖర రెడ్డి చేపట్టారని ఏ అనుమతులు లేనప్పుడే కాలువలు తవ్వించారన్నారు ఆయన. వైఎస్ చనిపోయే వరకు ప్రాజెక్ట్ పనులు అత్యంత వేగవంతంగా జరిగాయని కానీ ఆ తరువాత మందగించడంతో విభజన సమయంలో ఏపీ ఎంపీల కోరిక మేరకు జాతీయ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో చేర్చారని చెప్పుకొచ్చారు ఆయన.

Similar News