ప్రతి సోమవారం పోలవరం అంటూ ఆ ప్రాజెక్ట్ పై ప్రచారానికి టిడిపి సర్కార్ ఇచ్చిన టైటిల్. టైటిల్ ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి ఫీల్డ్ విజిట్ కి వచ్చేశారు. ప్రాజెక్ట్ పనులను సమీక్షించేశారు. అధికారులతో వివరాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు పొందారు. యాధావిధిగా మీడియా తో మాట్లాడుతూ ప్రాజెక్ట్ కన్నా ఎక్కువగా విపక్షాల తీరును దుయ్యబట్టేందుకే ఎక్కువ సమయం వినియోగించారు సీఎం. ప్రాజెక్ట్ శరవేగంగా లక్ష్యం మేరకు పనులతో దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు. పనిలేక కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని, వైసిపి నిర్మాణం జరక్కుండా అడ్డుపడుతోందని ఆరోపణలు విమర్శలు గుప్పించారు. పనిలో పని కాంక్రీట్ పని వేగవంతం గా చేపట్టడానికి వీలైన కూలింగ్ ప్లాంట్ ను ప్రారంభించేశారు.
ముఖ్యమంత్రి లెక్కలివే...
ఏపీ సీఎం ఇచ్చిన లెక్కలు ఇలా వున్నాయి. డయాఫ్రామ్ వాల్ 62 శాతం పూర్తి అయ్యింది. స్పిల్ వే 32 శాతం , ఎర్త్ వర్క్ 73 శాతం పూర్తి ఇంకా 27 శాతం మాత్రమే మిగిలి ఉందన్నారు. కాంక్రీట్ పని వేగంగానే ఉందన్నారు. అన్ని చెప్పిన సీఎం ట్రాన్స్ స్ట్రాయి కొనసాగడం కేంద్ర నిర్ణయం పై ఆధారపడి ఉందని వెల్లడించారు. కేంద్రమంత్రి గడ్కరీ సంక్రాంతి వెళ్ళాక రావొచ్చని, ప్రధాని తో భేటీ కి తేదీ ఇంకా ఖారారు కాలేదని తెలిపారు. ఇక పెన్నా గోదావరి నదులను అనుసంధానించేస్తామని తెలిపారు. పోలవరం నిర్మాణం కత్తి మీద సాములా సాగుతుంటే అరచేతిలో వైకుంఠం చూపించే పనికి ఎన్నికల ఏడాది కావడంతో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టేశారు.
సీఎం మాట్లల్లో క్లారిటీ లేదే ...?
ట్రాన్స్ స్ట్రాయి సంగతి తేల్చేస్తా 60 సి నిబంధన కింద మార్చేస్తా అన్న ముఖ్యమంత్రి పనులు శరవేగం అనే మాట చెప్పారు. అదే నిజమైతే కేంద్రం పాత కాంట్రాక్టర్ నే కొనసాగించే వీలుంది. ముఖ్యమంత్రే స్వయంగా పనులు లక్ష్యం మేరకు సాగుతున్నట్లు ప్రకటించాక ఇక కేంద్రం ఇబ్బంది లేదు కాబట్టి పాత కాంట్రాక్టర్ సూపర్ అని చెప్పేస్తుందా అనే సందేహం వ్యక్తం అవుతుంది. ఇంకేముంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పోలవరం వచ్చేస్తా అని చెప్పిన కేంద్రమంత్రి ఎప్పుడు వస్తారన్నది సీఎం కు ఇంకా క్లారిటీ రాలేదు. పోలవరం, విభజన సమస్యలు ప్రధాని తో ఈనెల 12 న భేటీ అయ్యి తేల్చేస్తారని అంతా భావిస్తే ఆయన తో సమావేశం తేదీ ఇంకా ఖారారు కాలేదని చంద్రబాబే చెప్పుకొచ్చారు. దాంతో పోలవరం పై ఇంకా గందరగోళమే కొనసాగుతుందన్నది విశ్లేషకుల అంచనా.