పోయేదే ఎక్కువ‌గా ఉందా..?

Update: 2018-02-27 04:30 GMT

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఐఐ స‌ద‌స్సుపై నిపుణులు సైతం పెద‌వి విరుస్తున్నారు. త‌మ‌కు కూడా ఈ స‌ద‌స్సుల ద్వారా ఏమేం వ‌స్తాయో రావో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు. మొత్తంగా మూడు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ భాగ‌స్వామ్యంతో రాష్ట్ర స‌ర్కారు విశాఖ ప‌ట్నంలో వ్యాపార స‌ద‌స్సు ఏర్పాటు చేసింది. దీనికి దాదాపు 55 దేశాల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల‌ను ఆహ్వానించారు. 42 దేశాల నుంచి బ‌డా కంపెనీల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. దీనికితోడు రాష్ట్ర గ‌వ‌ర్నర్, ఉప‌రాష్ట్రప‌తిల‌ను కూడా బాబు ఆహ్వానించారు.

పెట్టుబడులు వచ్చాయంటున్నారు.....

ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా వివిధ పారిశ్రామిక దిగ్గజాలను ఒప్పించ‌డం ఒప్పందాలు చేసుకోవ‌డం అనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇప్పటికి ఇది మూడో సారి. అయితే, ఈ స‌ద‌స్సుల మూలంగా ఏపీకి ఎన్ని పెట్టుబ‌డులు ప్రత్యక్షంగా వ‌స్తున్నాయంటే.. చెప్పలేని ప‌రిస్థితి. ఇక‌, గ‌తంలో చేసుకున్న ప‌లు ఒప్పందాలు ఇప్పటికీ పేప‌ర్లను దాట‌లేదు. వ‌స్తాం.. చేస్తాం.. చూస్తాం.. అనే స‌మాధాన‌మే విదేశీ పారిశ్రామిక దిగ్గజాల నుంచి వినిపిస్తోంది. ఇక‌, అదేస‌మ‌యంలో రాజ‌ధాని లేక‌పోవ‌డాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నా రు.దీంతో పెట్టుబ‌డుల స‌ద‌స్సు అయితే జ‌రుగుతున్నా.. పెట్టుబ‌డులు వ‌స్తున్న ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదు.

ఖర్చు తడిసి మోపెడు.....

ఇక‌, దీనిలో రెండో కోణం కూడా ఉంది. ఈ స‌ద‌స్సుకు వ‌స్తున్నవారు త‌క్కువ వారేమీ కాదు, దిగ్గజ సంస్థల‌కు చెందిన వారు. దీంతో వీరు విశాఖ ప‌ట్నంలో అడుగు పెట్టింది మొద‌లు తిరిగి విమానం ఎక్కే వ‌ర‌కు అన్నీ ప్రభుత్వమే చూసుకోవాల్సి వ‌స్తోంది. దీంతో ఖ‌ర్చు త‌డిసిమోపెడు అవుతోంది. పెట్టుబడులను ఆకర్శించడానికి జరగాల్సిన సమావేశం, విందులు వినోదాలకు వేదికగా నిలిచింద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. విశాఖలో అత్యంత రద్దీగా ఉండే వుడా పార్క్‌కు సమీపంలోని ఎంజీఎం పార్క్‌లో అతిథుల‌కు విందు ఏర్పాట్లు భారీగా జరిగాయి. సీఎం చంద్రబాబు వారికి దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బాలివుడ్ నుంచి డ్యాన్సర్లు....

అతిథులను ఆకట్టుకోవడానికి ఆటపా టలను కుడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం బాలీవుడ్‌ నుంచి ప్రముఖ డ్యాన్సర్లను, పాప్‌ గాయకులను పిలిపించారు. అంతేకాదు వీటితో పాటు పలు విలాసవంతమైన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులను అలరించే బాధ్యతను ఈ-ఫాక్టర్‌ అనే సంస్థకు అప్పగించారు. దీనికిగాను కోట్ల రూపాయ‌లే ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలిసింది. ఇక‌, ప్రతి ఒక్కరికీ.. విశాఖ‌లోని ప్రముఖ హోట‌ళ్లలో ప్రభుత్వమే వసతి ఏర్పాటు చేసింది. మొత్తంగా పెట్టుబ‌డుల మాట దేవుడెరుగు కానీ, ఈ స‌ద‌స్సుల పేరుతో చంద్రబాబు మాత్రం.. కోట్లకు కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌నే విమ‌ర్శలు మాత్రం వ‌స్తున్నాయి మ‌రి దీనిని ఎలా స‌మ‌ర్ధించుకుంటారో చూడాలి.

Similar News