పొత్తుపై గోరంట్ల జోస్యం ఇదే....!

Update: 2018-02-03 10:30 GMT

బిజెపి తో పొత్తు తెంపుకోవాలా ఉంచుకోవాలా అన్నది టిడిపి అధిష్టానం తేల్చుకోలేక సతమతమౌతుంది. ఆలస్యం అమృతం విషం అని తొందరగా బయటకు వచ్చి పోరాడదామని కొందరు అంటుంటే, మరికొందరు నిదానమే ప్రదానం అనే వాదాన్ని పార్టీ అధిష్టానం ముందు పెడుతున్నారు. దాంతో కేంద్ర బడ్జెట్ సృష్ట్టించిన ప్రకంపనల పరంపర ఏపీలో ఇంకా కొనసాగుతూనే వుంది. బిజెపి తో పొత్తు ఉంచాలా తీసెయ్యాలా అన్నది తేల్చుకోలేక టిడిపి చర్చల మీద చర్చలు నిర్వహిస్తుంది. జరుగుతున్న పరిణామాలను మాత్రం బిజెపి నిశీతంగా పరిశీలిస్తూ దేనికైనా రెడీ అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ప్రయోజనం లేని పొత్తు ఎందుకంటున్న....

రైల్వే జోన్ ఇవ్వలేదు, రాజధాని నిర్మాణానికి నిధులు లేవు, విద్య సంస్థలకు నిధులు ఇవ్వలేదు, పోలవరం మాటే లేదు, విభజన చట్టంలో పెట్టిన వాటికి దిక్కులేదు, నాలుగేళ్లుగా కాళ్ళు అరిగేలా కేంద్రం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేని దానికి ఇక బిజెపి తో పొత్తు ఎందుకంటున్నారు టిడిపి సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ బలం ఉందని ఎగిరెగిరి పడిన వారికి రాజస్థాన్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు గుర్తు తెచ్చు కోవాలని, కళ్ళు తెరవాలన్నారు బుచ్చయ్య చౌదరి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టి లో పెట్టుకుని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అయన చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇక ముందు బిజెపి సర్కార్ ఏదో సాయం చేస్తుందన్న భ్రమ లేదని స్పష్టం చేశారు.

అసంతృప్తి తోనే ఉన్నాం : మంత్రి జవహర్

కేంద్ర బడ్జెట్ పై తాను అసంతృప్తిగా వున్నానని చెప్పారు రాష్ట్ర ఎక్సయిజ్ శాఖామంత్రి కెఎస్ జవహర్. దీనిపై తనకున్న పరిధి దృష్ట్యా లోతుగా చెప్పలేను అని మంత్రి పేర్కొనడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే వెళతామని స్పష్టం చేశారు జవహర్.

Similar News