పొత్తు చిత్తయితే బిజెపి వ్యూహం ఇదేనా ...?

Update: 2018-02-04 07:30 GMT

ఏపీలో బలం లేకపోయినా బిజెపి దూకుడుగా వెళుతున్న వ్యూహం వెనుక కమలనాధులు ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి ? తెగేదాకా తాడు లాగి టిడిపి ని తాము విసిరిన వ్యూహంలో చిక్కుకునేలా బిజెపి చేయబోతుందా ? బిజెపి ని గత్యంతరం లేక వీడే పరిస్థితి టిడిపి కి ఎదురుకాబోతుందా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పొత్తుల ఎత్తుల వెనుక పలు కారణాలు విశ్లేషిస్తున్నారు. మరింత పదునైన దాడి బిజెపి ఇక చేయబోతుందంటున్నారు.

విడిపోతే ఇలా ....

టిడిపి తో కట్ చేసుకున్నాక బిజెపి మొదటగా చేయబోయే పని జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిధుల దుర్వినియోగం పై విచారణ. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకుని కేంద్రం చేపట్టి శరవేగంగా పనులు సాగించి క్రెడిట్ తమ సొంతం చేసుకోవడం. విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం. అమరావతి భూదందా పై విచారణ కు ఆదేశం. ఓటుకు నోటు కేసు వేగవంతం చేసే దిశగా చర్యలు. ఇలా చంద్రబాబు సర్కార్ ను ఇరుకున పెట్టే చర్యలు అన్ని మోడీ, అమిత్ షా పక్కాగా అమలు చేయడానికి రంగం సిద్ధమైందంటున్నారు.

వాజపేయి హయాంలో 16 శాతం ఓట్లు ...

గతంలో వాజపేయి గాలిలో బిజెపి ఎవరితో పొత్తు లేకుండా 16 శాతం ఓట్లు ఒంటరిగానే సాధించింది. ఆ గాలి తో ఏపీలో బలపడతామనుకున్న బిజెపిని టిడిపి పొత్తు తో కౌగలించుకుని 2004 ఎన్నికలకు 2 శాతం ఓట్లకు ఆ పార్టీ పడిపోయేలా బలహీన పరిచిందనేది కమలనాధులు ఇప్పటికి మధనపడుతుంటారు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన మోడీ హవాను మరోసారి పొత్తుతో సమర్ధంగా వాడుకుని అధికారం దక్కించుకుంది తెలుగుదేశం. మళ్ళీ గతంలో లాగే టిడిపి ఏపీలో బలహీనపడేలా తమపార్టీ పై అధికారం లోకి వచ్చినవెంటనే అడుగడుగునా వ్యవహరించిందని కమలం పార్టీ ఆరోపణ. మోడీ ఈసారి టిడిపి వ్యూహాన్ని పసిగట్టే సైకిల్ పార్టీ వారు అంతట వారే పొత్తు వదులుకుని వెళ్ళేలా అడుగులు వేస్తున్నారు అని సమర్థిస్తున్నారు బిజెపి నేతలు. తద్వారా ఏపీలో ఇప్పడు కాకపోయినా భవిష్యత్తు లో అయినా అన్ని నియోజకవర్గాల్లో బలపడే విధంగా ముందుకు వెళ్లొచ్చన్నది కమలనాధుల వ్యూహం గా వుంది. మరి ఏమి జరగబోతుందన్న రాబోయే రోజులే తేల్చనున్నాయి.

Similar News