పులివెందుల గడ్డపై నువ్వా? నేనా?

Update: 2018-01-03 14:16 GMT

జ‌ల‌య‌జ్ఞం పేరిట నాడు కొన్ని ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు వైఎస్ శ్రీ‌కారం దిద్దారు. సాగునీటి వ‌న‌రుల వృద్ధే ధ్యేయంగా, పంట భూముల‌ను సస్య‌శ్యా మ‌లం చేయాల‌న్న త‌లంపుతో నాడు పెద్ద ఎత్తున్న నిధులు కేటాయించారు. వీటిలో అవ‌క‌త‌వ‌కల తీరెలా ఉన్నా కొంత‌లో కొంత రైతుకు సాయ‌పడ్డాయి. తాజాగా ఇదే కోవ‌లో క‌డ‌ప జిల్లాలో చేపట్టిన ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తైంది. వీటి ప్రారంభానికి వ‌చ్చిన వేళ సీఎం వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిపై సీరియ‌స్ అయ్యారు. స్థానిక ఎంపీ అవినాష్‌రెడ్డి ఈ ప‌థ‌కం పనుల గురించి మాట్లాడుతూ చంద్ర‌బాబు ఎదుటే త‌న నిర‌స‌న తెలిపి, బాబు ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టుకు చేసిందేమీ లేద‌ని తేల్చేశారు. గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించినా, ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి 85 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిదేనని అన్నారు. రూ.1300 కోట్లు వెచ్చిం చి 85 శాతం పనులు పూర్తి చేయించారని, పులివెందులను సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని ఎంపీ అవినాశ్ రెడ్డి తేల్చేశారు.

వైఎస్ ను పొగిడారని....

వైఎస్‌ఆర్‌ కృషిని ఎవరు మరువలేరని చెబుతూనే చంద్ర‌బాబు స‌ర్కార్ తీరుని ఎండ‌గట్టారు.దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అడుగడుగునా ఆయ‌న ప్ర‌సంగానికి అడ్డుత‌గిలారు. వెంట‌నే అవినాశ్ ప్ర‌సంగం మ‌ధ్య‌లోనే జోక్యం చేసుకున్న చంద్ర‌బాబు త‌మ్ముడూ ఇది ప్ర‌జావ‌స‌రాల ప‌రిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న స‌భ‌...ఇక్క‌డ రాజ‌కీయాలు మాట్లాడ‌వ‌ద్ద‌ని కాస్త గ‌ట్టిగానే మాట్లాడారు. ఈ రోజు ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది నేను... అయినా దాని గురించి నేను చెప్పుకోలేదు.. ఇక్కడ ఎవరు రాజకీయాలు మాట్లాడకూడదని, ఎవరి సభలు వారికుంటాయని, అక్కడ మాట్లాడుకోవాలని, ఇక్కడ స‌మావేశం గౌర‌వంగా జ‌ర‌గాల‌ని ఆయ‌న అవినాశ్‌కు సూచించారు.

బాబు సీరియస్ వార్నింగ్....

అవినాశ్ ఈ ప్రాజెక్టు ఘ‌న‌త వైఎస్‌దే అని ప‌దే ప‌దే చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా బాబు సీరియ‌స్‌గా వార్నింగ్ ఇవ్వ‌డంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. ఇదిలా ఉంటే జ‌న్మ‌భూమి స‌భావేదిక‌పై సీఎం ప్ర‌వ‌ర్తించిన తీరుని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శ్రీ కాంత్‌ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. బహిరంగ సభలో నిజాలు మాట్లాడకూడదా?. ఒక ఎంపీకి ఇచ్చే గౌరవం ఇదేనా?. అది తెలుగుదేశం సమావేశమా? లేకా జన్మభూమి కార్యక్రమమా? అని ప్ర‌శ్నించారు. సీఎంను ముఖాముఖి ప్ర‌శ్నించి అవినాశ్ త‌న మైలేజీ పెంచుకున్నార‌ని వైసీపీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టిదాకా వైసీపీఎంపీలు ఎవ్వ‌రూ బాబుకు ఎదురెళ్లి మాట్లాడిన దాఖ‌లాలు లేవు. ఈ ఘ‌ట‌న‌తో టీడీపీ వైసీపీ వార్ మ‌రింత రాజుకుంది. ఇదే దూకుడుతో జ‌న్మ‌భూమి స‌భ‌ల‌ను అడ్డుకుని పాల‌కుల‌ను నిల‌దీయాల‌న్న‌ది వైసీపీ ప్లాన్‌. వాస్త‌వానికి జ‌న్మ‌భూమి స‌భ‌ల‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది కూడా! కానీ క‌డ‌ప‌లోరూట్ మార్చి అవినాశ్ అనూహ్య రీతిలో తన నిర‌స‌న తెలిపి సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు.

Similar News