పీసీసీ అధ్యక్షుడు మార్పు ఉంటుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పిస్తారా? అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. రాహుల్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రాల్లో కూడా కొత్త టీంను ఏర్పాటు చేసుకోనున్నారన్న ప్రచారం బలంగా విన్పిస్తోంది. ఈ వాదనలను నిజం చేస్తూనే తెలంగాణ ఇన్ ఛార్జి కుంతియా, జాతీయ ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజులు ఇద్దరూ పీసీసీ అధ్యక్షుడికి ప్రమేయం లేకుండానే పావులు కదుపుతున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న రాహుల్ తన దూతలను నేరుగా రంగంలోకి దించారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక శక్తులందరినీ ఏకం చేయడానికి కొప్పుల రాజు, కుంతియాలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కుంతియా, కొప్పుల రాజులు కోదండరామ్, గద్దర్ వంటి నేతలను రహస్యంగా కలిశారని తెలుస్తోంది. రాహుల్ ఆదేశం మేరకే తెలంగాణలో పేరున్న నేతలను వీరు వరుసగా కలుస్తున్నారు. ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నేతలకు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు.
పీసీసీకి కొత్త అధ్యక్షుడు తప్పదా?
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సారధి పగ్గాలను కూడా మారుస్తారంటున్నారు. రాహుల్ నామినేషన్ పత్రాలపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సంతకం చేయడం కూడా ఉత్తమ్ పదవి ఎసరు పెట్టినట్లేనంటున్నారు. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఎన్నికలకు ముందు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలన్నది రాహుల్ ఆలోచనగా ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికే ఈ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రేసులో డీకే అరుణ, జీవన్ రెడ్డి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. జానారెడ్డి సీనియర్ నేత అయినా.. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఎన్నికలను డ్రైవ్ చేయలేరని అధిష్టానం భావిస్తోంది. దీంతో జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేరు కూడా పీసీసీ రేసులో బలంగా విన్పిస్తుంది. జీవన్ రెడ్డి అయితే ఎవరూ వ్యతిరేకించరని కూడా హైకమాండ్ భావిస్తోంది.
దామోదరకూ ఛాన్స్.....?
అయితే బీసీ, ఎస్సీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధుయాష్కిల పేర్లు వినపడుతున్నాయి. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో దామోదర రాజనర్సింహకే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఇక బీసీలకు అవకాశం కల్పిస్తే రాహుల్ తో సన్నిహిత సంబంధాలున్న మధుయాష్కీకి గ్యారంటీ అంటున్నారు. రాహుల్ కు నమ్మకమైన నేత కావడం, కర్ణాటక ఇన్ ఛార్జిగా కూడా బాధ్యతలు చక్కగా చూస్తుండటంతో మధుయాష్కీ వైపు రాహుల్ మొగ్గుచూపే అవకాశముందంటున్నారు. మొత్తం మీద రాహుల్ టీం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సంబంధం లేకుండానే రంగంలోకి దిగి కార్యాచరణను ప్రారంభించడం పార్టీలో చర్చనీయాంశమైంది.