వపన్ కల్యాణ్ చంద్రబాబు, మోడీ భేటీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మోడీతో భేటీ అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో్ ఏపీకి అనుకున్న మేర ప్రయోజనాలు రావనే తెలిసి పోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలంటున్న పవన్ కల్యాణ్ నోరు మెదపక పోవడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రత్యేక హోదా గురించి అస్సలు చంద్రబాబు అడగక పోవడం, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి నిధులు కూడా విడుదల చేయకపోవడం వంటి అంశాలపై పవన్ గళం విప్పలేదు. మోడీతో భేటీ తర్వాత చంద్రబాబు అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్పడం... మోడీ నుంచి అనుకున్న స్పందన రాలేదనే అనుకోవచ్చు.
ఏపీ ప్రయోజనాలపై ప్రశ్న ఏదీ?
మరి ఈ నేపథ్యంలో జనసేనాని మనోగతం ఏమిటన్నది ఆ పార్టీ కార్యకర్తల్లోనూ చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం అందరినీ సిద్ధం చేస్తున్నారు. అయితే ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై పవన్ మాత్రం స్పందించడం లేదు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి వచ్చిన తర్వాత మళ్లీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు కరెక్ట్ గా చెప్పొచ్చు కదా? అని కూడా పవన్ ప్రశ్నించారు. కాని ఆతర్వాత దాని గురించి ఊసే లేదు.
పూర్తిగా రాజకీయాల్లో....
సినిమా హిట్టయినా...ఫట్టయినా పవన్ పెద్దగా పట్టించుకోరు. ఆయన సినిమాలో నటించడం వరకే... అయితే తన సినిమాలో నష్టపోయిన వారిని మాత్రం ఆయన ఆదుకుంటారు. ఇది సినిమాల సంగతి. ఇక ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా విడుదలయింది. గత వారం రోజుల నుంచి పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టిపెట్టారు. ఆయన సినిమా విడుదలయిన రోజు కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి వివిధ సమీక్షలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు జనసైనికులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ కార్యాలయంలో ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు.
ప్లీనరీపై సమీక్ష...
కొద్ది రోజుల్లోనే ప్లీనరీ ఏర్పాటు చేయాలని పవన్ భావిస్తున్నారు. ప్లీనరీ హైదరాబాద్ లోనా, విజయవాడలోనా అన్నది ఇంకా నిర్ణయించకపోయినా ప్లీనరీని మాత్రం ఘనంగా నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ ముఖ్యులతో చర్చించారు. ప్లీనరీ పూర్తయిన తర్వాత జిల్లాల పర్యటనలకు పవన్ బయలు దేరనున్నారు. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా తయారయినట్లు తెలుస్తోంది. పవన్ అనంతపురం జిల్లా నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ప్లీనరీ తర్వాత ఎంపిక చేసిన జనసైనికులందరూ వారి వారి నియోజకవర్గాల్లో యాత్ర కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఏపీలో నాలుగు రోజులు పర్యటించి హడావిడి చేసిన పవన్ తర్వాత పత్తా లేకుండా పోయారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.