పీకే బలహీనతను బయటపెట్టిన ముద్రగడ....!

Update: 2018-02-10 07:30 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి ఏకంగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పడటం విశేషం. పవన్ కల్యాణ్ ఇటీవల ఏపీ విభజన హక్కుల సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడ మాత్రం పవన్ శక్తి సరిపోదని చెప్పేశారు. పవన్ నాయకత్వంలో హక్కులసాధన కష్టమేనని ముద్రగడ అభిప్రాయపడ్డారు. ఆయన కొద్దిసేపటి క్రితం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ బలం సరిపోదు....

పవన్ కల్యాణ్ తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడాన్ని ముద్రగడ పద్మనాభం తప్పుపడుతూనే వస్తున్నారు. ఒకదశలో పవన్ ఎవరో తనకు తెలియదని కూడా వ్యాఖ్యానించారు. మరోసారి జేఏసీ పేరుతో తెలుగేదేశానికి మేలు చేకూర్చమే పవన్ చేస్తున్నారని ముద్రగడ అభిప్రాయపడుతున్నారు. అందుకే పవన్ బలం సరిపోదని వ్యాఖ్యనించారు. అందరూ కలిసి సమిష్టిగా ఉద్యమం చేస్తే తప్ప ఏపీ విభజన హామీలు నెరవేరవని ముద్రగడ తెలిపారు. ఇందుకు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు, కేంద్రమంత్రులు రాజీనామా చేయాలన్నారు. అలా చేస్తే తమ కాపు జాతి మొత్తం టీడీపీకి అండగా నిలుస్తుందని చెప్పారు.

తేల్చకుంటే...తేల్చుకుంటాం....

మరోవైపు కాపు రిజర్వేషన్లపై కూడా ముద్రగడ గళం విప్పారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి బీసీ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడే కాపులకు అసలైన పండగని ముద్రగడ చెప్పారు. చంద్రబాబు తన ఎన్నికల మ్యానిఫేస్టోలో చెప్పినట్లు కాపులను బీసీల్లో చేస్తామని ఇచ్చిన హామీని జాప్యం చేశారన్నారు. అందుకే తాము ఉద్యమం బాట పట్టాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో జరగబోయే ప్రతి నియామకాల్లో బీసీ (ఎఫ్) ద్వారా నియమించి తమకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి హామీని నెరవేర్చకపోతే తాము ఎలాంటి ఉద్యమం చేయాలో తమకు తెలుసన్నారు. కాపులను మోసం చేస్తే.... ఆజాతి కూడా టీడీపీకి మోసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు ముద్రగడ.

Similar News