పిచ్చి వేషాలు వద్దు...ఒళ్లు దగ్గర పెట్టుకోండి

Update: 2018-03-06 06:30 GMT

ఒక్క పక్క చర్చలు జరుగుతున్నాయి. మరొకపక్క మాటలు తూలుతున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ నేతల తీరు ఇది. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీలో ఏపీలో మాత్రం శత్రుపక్షాలుగా మారిపోయాయి. టీడీపీ ఆందోళనలు సరికాదంటున్న కమలనాధులు...మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నిన్న విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో మోడీ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తిని మెడలు వంచుతూ ప్రదర్వన నిర్వహించారు.

టీడీపీలో రౌడీలు, గూండాలు.....

దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు టీడీపీకి హెచ్చరికలు జారీ చేశారు.పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిరసనలు శృతిమించుతున్నాయన్నారు. మోడీని అవమానపర్చే విధంగా నిరసనలు చేసిన వారిపై ప్రభుత్వం సుమోటోగా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా వాసుపల్లి గణేశ్ తన తీరును మార్చుకోవాలన్నారు. రౌడీలను, గూండాలను అద్దెకు తీసుకుని వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదన్నారు. చంద్రబాబు మౌనం వీడకుంటే ఆయన ఈ చర్యలన్నింటినీ సమర్థిస్తున్నట్లేనని అనుకోవాల్సి వస్తుందని విష్ణుకుమార్ రాజు అన్నారు. టీడీపీలో గూండాలకు, రౌడీలకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు.

సీఎంను విమర్శించే స్థాయి లేదు....

దీనిపై టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పందించారు. బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడల్నారు. సీఎంను విమర్శించే స్థాయి వారికి లేదని చెప్పారు. దమ్ము, ధైర్యం ఉంటే విభజన హామీలను కేంద్రం చేత అమలు చేయించాలని కోరారు. అంతే తప్ప ముఖ్యమంత్రి, టీడీపీపై అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుందన్న కడుపు మంటతోనే రోడ్డెక్కాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఇలా టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం ఇంకా ముగియలేదు. ఒకపక్క చర్చలు జరగుతున్న సమయంలో ఏపీలోని టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తుండటం గమనార్హం.

Similar News