పాలమూరులో ప్రొటోకాల్ రగడ

Update: 2017-10-08 09:30 GMT

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి అధికార పార్టీ నేతల మధ్య చిచ్చురేగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడంపై మంత్రులపై ఫైర్ అవుతుననారు. జడ్పీ సర్వ సభ్య సమావేశంలోనూ ఈ వివాదం చర్చకు దారితీసింది. జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న అతిధి గృహాన్ని మరమ్మత్తులు చేసి తిరిగి ప్రారంభించే కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలిసి ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రారంభించారు. అయితే స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా ప్రారంభోత్సవం చేయడంపై ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మండిపడుతున్నారు. ముఖ్యంగా తనకు తెలియకుండా మంత్రులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ ఇదే చర్చ రచ్చకు కారణమయింది. సమావేశం అంతా ఎమ్మెల్యే వర్సెస్ మంత్రులుగా మారిపోవడంతో రచ్చ రచ్చ అయింది.

మంత్రులను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్......

ఎప్పటినుంచో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. కలెక్టర్ విషయంలోనూ ఎమ్మెల్యే తాను చెప్పినట్లు వినడం లేదని కలెక్టర్ కు వ్యతిరేకంగా ఆందోళనకు కూడా దిగారు. అయితే తాజాగా జడ్పీ గెస్ హౌస్ ప్రారంభోత్సవాన్ని తాను లేకుండా ఎలా చేస్తారని శ్రీనివాస్ గౌడ్ నేరుగా మంత్రులిద్దరినీ నిలదీశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆయన గొడవ చేశారు. అయితే తాము ఆహ్వానం పంపామని అధికారులు చెబుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఆలస్యంగా రావడంతోనే ప్రారంభోత్సవం జరిగిపోయిందని అధికారులు అంటున్నారు. కాని శ్రీనివాస్ గౌడ్ మాత్రం ప్రొటోకాల్ ఉల్లంఘనేనని, తాను స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మంత్రులిద్దరూ ఎంత నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా శ్రీనివాస్ గౌడ్ వినలేదు. ఇలా పాలమూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది.

Similar News