ఎందుకిలా జరుగుతోంది. తాము అధికారంలో లేకపోతే పాలన సాగనివ్వరా? అక్కడ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి స్వేచ్ఛ లేదా? ప్రజానుకూలమైన నిర్ణయాలను తీసుకునే అవకాశమూ ముఖ్యమంత్రికి, పాలకులకు లేదా? ఇదే విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పుదుచ్చేరి, ఢిల్లీ ప్రభుత్వాలు కేవలం ప్రేక్షక పాత్రనే పోషిస్తున్నాయన్నది విశ్లేషకుల భావన. ఇక్కడ లెఫ్ట్ నెంట్ గవర్నర్లే కీలకంగా మారారు. ప్రభుత్వాలకు సహకరించకపోవడం వల్లనే లెఫ్ట్ నెంట్ గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు తరచూ తలెత్తుతున్నాయి.
పుదుచ్చేరిలోనూ ఇంతే....
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి నారాయణస్వామి గత కొన్నాళ్లుగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలను అడ్డుపుల్లలు వేయడం, తమతో సంప్రదించకుండానే అధికారులతో సమీక్షలు నిర్వహించడం, నియామకాలు చేపట్టడం వంటి వాటిని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం చేబుతూ వస్తుంది. రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేసింది. లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపట్టింది ప్రభుత్వం. అయినా ఫలితం లేదు. ఇప్పటికీ పుదుచ్చేరిలో అక్కడి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు, ప్రభుత్వానికి అస్సలు పొసగడం లేదు. ఈ పంచాయతీలో ఢిల్లీ జోక్యం చేసుకోవడం లేదు.
ఢిల్లీలో పాలన ఏదీ?
ఇక తాజాగా ఢిల్లీ ప్రభుత్వాన్నే తీసుకుంటే చీఫ్ సెక్రటరీపై అధికార పార్టీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో దాడికి పాల్పడిన ప్రకాశ్ జుర్వాల్, అమాన్ తుల్లా ఖాన్ లు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయాలంటూ బీజేపీ, అక్రమ అరెస్ట్ లంటూ ఆమ్ ఆద్మీ పార్టీలు పోటా పోటీ ఆందోళనలకు దిగాయి. అయితే చీఫ్ సెక్రటరీపై దాడి జరిగిన విషయాన్ని కాసేపు పక్కన పెడితే తొలినుంచి ఇక్కడి ప్రభుత్వానికి, లెఫ్ట్ నెంట్ గవర్నర్ కూ పడటం లేదు. పాలనపరమైన నిర్ణయాల్లో గవర్నర్ జోక్యం ఉండటానికి వీల్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రోడ్డెక్కారు. కోర్టు గుమ్మమూ తొక్కారు.
వారిదే తుది నిర్ణయం....
ఢిల్లీలో ఏపనిచేయాలన్నా లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరి అవుతుంది. దీనిపై కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేదు. ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నా పరిపాలనాధికారి లెఫ్ట్ నెంట్ గవర్నర్ మాత్రమేనంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ప్రస్తుత ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ బైజాల్ ప్రభుత్వ నిర్ణయానికి మోకాలడ్డటం వల్లనే సీఎస్ పై దాడి వరకూ వెళ్లిందని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ సేవలన్నీ డోర్ డెలివరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి బైజాల్ అంగీకరించలేదు. ఇదే విషయాన్ని సీఎస్ సమావేశంలో చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం అమలు చేయాల్సిందేననిచెప్పింది. అయితే తాను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కే జవాబుదారీతనంగా ఉంటానని, ఆయన మాటలనే శిరసావహిస్తానని చెప్పడంతో ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఢిల్లీ, పుదుచ్చేరిల్లో లెఫ్ట్ నెంట్ గవర్నర్లే కీలకంగా మారారు. ప్రభుత్వాలకు కొరకరానికొయ్యలుగా తయారయ్యారు. అందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ప్రభుత్వమున్నా సహకరించాలి గాని, ఇలా లెఫ్ట్ నెంట్ గవర్నర్లతో పాలన నడిపించాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ వివాదాలకు మాత్రం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేట్లు లేదు.