తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. ఆయన గ్రాండ్ గా పార్టీ ప్రకటనను త్వరలోనే చేయబోతోన్నారు. అయితే పార్టీ పెట్టక ముందే కోదండరామ్ పై దాడి స్టార్ట్ అయింది. పార్టీ పురుడు పోసుకోకముందే విమర్శల వర్షం మొదలయింది. అసలు ఎవరి కోసం పార్టీ పెట్టాల్సి వచ్పింది? పార్టీ ఎందుకు పెడుతున్నారు? పార్టీ లక్ష్యం ఏంటి? ఎవరిని గట్టెక్కించాలని పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారంటూ ఉద్యమ పార్టీలే ఎదురు ప్రశ్నలు వేస్తున్నాయి. కోదండరామ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో అంకిత భావంతో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందుకు తీసుకెళ్లారనే పేరు పొందారు.
ఆయనంటే అందరికీ గౌరవమే...
అలాంటి కోదండరామ్ నాలుగేళ్ల వరకూ పార్టీ పెట్టే యోచనే చేయలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణ వచ్చినా...ఫలితం దక్కడం లేదన్న ఆవేదనతో పార్టీని పెట్టాల్సి వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి రాష్ట్రం ఏర్పాటు వరకూ కోదండరామ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలనూ కలుపుకుని జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని సమర్థవంతంగా నడపగలిగారు. ఆయనంటే అందరికీ గౌరవం. ఎటువంటి మచ్చ లేని నేత కావడం, ప్రజాసమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ఆయన ఈ నాలుగేళ్లు ప్రజాక్షేత్రంలో తిరిగారు.
కేసీఆర్ కు లాభమేనంటున్న....
అయితే నిన్నటి వరకూ ఆయనతో కలిసి పనిచేసిన నేతలే ఆయనపై మాటల దాడిని ప్రారంభించడం గమనార్హం. ఇందులో తెలంగాణ ఇంటిపార్టీ ముందుంది. తెలంగాణాలో కేసీఆర్ సర్కార్ ను గద్డె దించడానికి అనేక పార్టీలూ ప్రయత్నిస్తుంటే కొత్తగా పార్టీ ఏర్పాటు ఎందుకని తెలంగాణ ఇంటిపార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీలనూ కేసీఆర్ కు వ్యతిరేకంగా కూడగట్టాల్సిన తరుణంలో కోదండరామ్ కొత్త పార్టీ పెట్టడం కేసీఆర్ కు లబ్ది చేయడమేనన్నది ఆ పార్టీ నేతల వాదన. ఇప్పటికైనా కోదండరామ్ టీఆర్ఎస్ కు మరోసారి అధికారం అప్పగించే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ఆ పార్టీ నేతలు యన్నం శ్రీనివాసులు రెడ్డి, చెరుకు సుధాకర్ లు కోదండరామ్ కొత్త పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే కోదండరామ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త పార్టీ లాంచింగ్ పైనే దృష్టి పెట్టారు. మొత్తం మీద పార్టీ పురుడు పోసుకోకముందే ఉద్యమపార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొనడం కోదండరామ్ కు కొంత ఇబ్బంది కర పరిణామమే.