పాదయాత్రకు విరామమిచ్చి ఫోన్లో

Update: 2018-03-02 01:30 GMT

ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఆందోళన సక్సెస్ అయింది. గురువారం 13 జిల్లాల్లో వైసీపీ శ్రేణులు కలెక్టరేట్లను ముట్టడించాయి. ఆందోళనను నిర్వహించాయి. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని వైసీపీ నేతలు నిర్వహించారు. జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించి జిల్లాల వారీగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగిన తీరును పరిశీలించారు. నివేదికలు తెప్పించుకున్నారు. ప్రతి జిల్లాలో ముఖ్యనేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్లను ముట్టడించారు.

జోష్ నింపిందంటున్న వైసీపీ....

పాదయాత్రతోనే జగన్ పార్టీలో జోష్ నింపారు. తాజాగా ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామా ప్రకటన, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రకటనతో పార్టీలో మరింత ఉత్సాహం పెరిగింది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ అన్ని జిల్లాల్లో బలంగా ఉండటంతో వైసీపీ నేతల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించారు. ప్రతి జిల్లాలో సీనియర్ నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు అందరూ తాము ప్రత్యేక హాదా కోసం రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.

అందరూ పాల్గొని....

వైసీపీ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం సక్సెస్ అయిందని ఆ పార్టీ ప్రకటించింది. తాము ఊహించిన దానికన్నా ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపింది. సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు తమ జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇక వైసీపీ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలు ఆందోళనలో పాల్గొని క్యాడర్ లో జోష్ నింపారు. పాదయాత్రకు విరామం ప్రకటించి మరీ జగన్ అందరి నేతలతో ఫోన్ లో మాట్లాడి కార్యక్రమంపై ఆరా తీసినట్లు తెలిసింది.

101 రోజు పాదయాత్ర షెడ్యూల్.....

ఇక జగన్ ప్రజాసంకల్ప పాదాయత్ర నేడు జరగనుంది. జగన్ పాదయాత్ర 101వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. చీమకుర్తి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర మంచికలపాడు చేరుకుంటుంది. అక్కడ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత అక్కడి నుంచి బండ్లమూడి చేరుకుంటారు. తర్వాత తొర్రగుడిపాడు క్రాస్ రోడ్స్ నుంచి బండ్లమూడి కాలనీకి చేరుకుని భోజన విరామానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం పల్లమల్లి మీదుగా గడిపత్రివారి పాలంకు పాదయాత్ర చేరుకుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు.

Similar News