పాదయాత్రకు విరామం తప్పదా?

Update: 2017-10-21 04:30 GMT

వైసీపీ అధినేత జగన్ కు కోర్టు నుంచి హాజరు నుంచి మినహాయింపు కష్టంగానే కన్పిస్తోంది. సీబీఐ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పుడుతున్నాయి. వారానికి ఒక్కసారి కోర్టుకు హాజరైతే తప్పేంటని... ఇబ్బందేంటని జగన్ ను సీబీఐ న్యాయస్థానం ప్రశ్నించడం విశేషం. కోర్టుల పట్ల గౌరవంతోనే... కేసుల విషయంలో హాజరవుతున్నానని ప్రజలకు చెప్పుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు వర్షం పడితే పాదయాత్ర ఎలా సాధ్యమవుతుందని కూడా ప్రశ్నించింది. అయితే తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో వైసీపీ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

వారానికి ఒకరోజు.....

జగన్ వచ్చే నెల 2వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేపడుతున్నారు. మొత్తం మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగే ఈ పాదయాత్ర ఏపీ మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లనుంది. అయితే ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. అయితే న్యాయస్థానం వ్యాఖ్యలను బట్టి మినహాయింపు లభించే అవకాశం తక్కువేనని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాదయాత్రకు బ్రేకులు తప్పవంటున్నారు. పాదయాత్ర కొనసాగిస్తూ.. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిందేనని కోర్టు తీర్పు చెబితే... అందుకు అనుగుణంగా కూడా జగన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వారానికి ఒకరోజు పాదయాత్రకు విరామమివ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Similar News