ప్రజాసంకల్ప పాదయాత్రలో దాదాపు నాలుగు జిల్లాలు చుట్టేసిన వైసిపి అధినేత జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి ? ఎన్నికలకు సమయం దగ్గర పడే సమయంలో ఆయన ఏమి చేయబోతున్నారు. రెండు రకాల ప్లాన్ లు వైఎస్ జగన్ సిద్ధం చేశారు. పాదయాత్ర పూర్తి అయిన వెంటనే అమరావతి కేంద్రం గా భారీ ఎత్తున బిసి సదస్సు నిర్వహించనున్నారు జగన్. అందులో బిసి డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఇలా కులాల వారీగా వైసిపి అధికారంలోకి వస్తే తమ పార్టీ ఏమి చేయబోతుందో ప్రజలకు హామీలు ఇవ్వనున్నారు ఆయన.
బాబు ఓటు బ్యాంక్ రాజకీయాలకు కౌంటర్ ఇవ్వడానికి ...
చంద్రబాబు సర్కార్ కులాల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యాలతో టిడిపి అందరికి బాగానే చేరువ అవుతుంది. రాష్ట్రంలో కులాల వారీగా డిమాండ్లు ఆయా సంఘాలు మొదలు పెట్టాయి కూడా. వీటిని దృష్టిలో పెట్టుకునే జగన్ కులాల వారీ భరోసా కల్పించాలని తద్వారా అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేయాలని భావిస్తున్నారు. దీని వల్ల అటు టిడిపి కి కౌంటర్ క్యాస్ట్ పాలిటిక్స్ మొదలు పెట్టినట్లు గా అలాగే కులాల వారి మన్ననలు పొందాలని స్కెచ్ వేశారు. ఇందులో తన బిసి డిక్లరేషన్ అంశం సదస్సు వివరాలు పాదయాత్రలో శ్రీకాళహస్తి నియోజకవర్గం పాపానాయుడు పేట లో వెల్లడించేసారు.
తర్వాత బస్సుయాత్ర.....
ఇలా కులాల వారీ సభలు సమావేశాలు పూర్తి అయ్యాక ఎన్నికలు దగ్గర చేసి పాదయాత్రలో కవర్ చేయని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను చుట్టేసేందుకు బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో పార్టీకి లభించిన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు జగన్ శ్రమిస్తున్నారు. నేతలు మారినా ఓటర్లు మారరన్న విశ్వాసంతో జగన్ ఉన్నారు. లీడర్ల వెంట కొద్దోగొప్పో క్యాడర్ వెళ్లిపోయినా అది తమ పార్టీకి సానుభూతిని ఇస్తుందన్న ఆలోచన కూడా వైసీపీ నేతల్లో ఉంది. దీంతో ఎవరు పార్టీని వీడి వెళ్లినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ ఇప్పటికే సీనియర్ నేతలకు సంకేతాలిచ్చారు. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా బహుముఖ పోరాటానికి సంకల్పించిన విపక్ష నేత జగన్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.