పాక్‌కు సుష్మాహెచ్చరిక: కాశ్మీర్‌ను విడగొట్టడం అసాధ్యం

Update: 2016-09-26 14:23 GMT

జమ్మూకాశ్మీర్‌ అనేది భారతదేశంలో ఒక అవిచ్ఛిన్న భాగం.. దీనిని ఎవ్వరూ కూడా వేరు చేయజాలరు.. అది ఎప్పటికీ భారత్‌లో అవిచ్ఛిన్న అంతర్భాగంగానే ఉంటుంది.. అని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ విస్పష్టంగా తేల్చిచెప్పారు. ఐక్యరాజ్యసమితిలో సోమవారం రాత్రి ప్రసంగించిన సుష్మాస్వరాజ్‌.. భారత వైఖరిని, విధానాల్ని, సిద్ధాంతాల్ని యావత్‌ ప్రపంచానికి తేల్చిచెప్పారు.

ప్రస్తుతం భారత్‌ ఎలాంటి ప్రయత్నాలతో పురోగమిస్తున్నదే అంశాలకు తన ప్రసంగంలో తొలిభాగాన్ని కేటాయించిన సుష్మాస్వరాజ్‌, ఆ పిమ్మట పాకిస్తాన్‌కు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదం అనేది ప్రపంచంలో ఏ రూపంలో ఉన్నా సరే.. అది ప్రపంచ మానవ హక్కులకు భంగకరమే అని, దానిని ఎదుర్కోవడం అందరి బాధ్యత అని ఆమె వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు సాయం, సహకారం, ఆయుధాలు ఎక్కడినుంచి అందుతున్నాయన్న ప్రశ్నలకు ఇదివరకు అందరి చూపు ఆఫ్గనిస్తాన్‌ వైపు మళ్లుతోంటే.. ఇప్పుడు అంతా పాకిస్తాన్‌ ను చూస్తున్నారని చెప్పారు. పాకిస్తాన్‌ ను ఒంటరిగా చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

పాక్‌ సరళి.. అద్దాల మేడలో కూర్చుని రాయి విసిరినట్లుగా ఉంటోందంటూ.. పాకిస్తాన్‌లోనే అంతర్గతంగా అనేక ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆమె ప్రస్తావించారు. భారత వైఖరిని విస్పష్టంగా ప్రకటిస్తూ, పాక్‌ దుశ్చర్యల్ని ఎండగడుతూ ఆమె చెప్పిన మాటలకు పలుమార్లు సభికులు హర్షధ్వానాలు చేశారు. సుష్మాస్వరాజ్‌ ఈ కార్యక్రమంలో హిందీలో ప్రసంగించారు.

మరోసారి బలూచిస్తాన్‌ వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికమీద ప్రస్తావించడం ద్వారా.. భారత్‌ , పాకిస్తాన్‌కు అసహనం కలిగిస్తున్న సంగతి తేటతెల్లం అవుతూనే ఉంది. పరోక్షంగా ఇది పాకిస్తాన్‌కు భారత్‌ చేస్తున్న హెచ్చరికగా కూడా భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు పరిగణిస్తున్నారు. పాకిస్తాన్‌ నుంచి విడిపోవాలనుకుంటున్న బలూచిస్తాన్‌ వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికలపై పదేపదే చర్చకు తీసుకురావడం ద్వారా జనం దృష్టిని పాక్‌లోని అణచివేతలపై తీసుకువెళ్లడం భారత్‌ లక్ష్యం అన్నట్లుగా ఉంది.

Similar News