పాక్ మరో దొంగ నాటకం...!

Update: 2018-01-04 18:29 GMT

పాకిస్థాన్ కుట్రల మీద కుట్రలు చేస్తోంది. అంతర్జాతీయ సమాజంలో తాను పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు అనేక అడ్డదారులు తొక్కుతోంది. తాజాగా పాక్ లో శిక్షణ అనుభవిస్తున్న మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ వీడియోను ఒకదానిని విడుదల చేసి మరో వింతనాటకానికి తెరతీసింది. ప్రపంచ దేశాల నుంచి సానుబూతిని పొందేందుకే పాక్ ఈ విధమైన చర్యలకు ఉపక్రమించిందని భారత్ భావిస్తోంది. కులభూషణ్ జాదవ్ మాట్లాడే వీడియో అసలా? నకిలీయా? అన్నది తేలాల్సి ఉంది. అయితే ఇది ఖచ్చితంగా నకిలీదేనని కులభూషణ్ జాదవ్ సన్నిహితులు తేల్చి చెబుతున్నారు.

జాదవ్ కుటుంబానికి నాడు అవమానం....

గత ఏడాది డిసెంబర్ 25న కులభూషణ్ జాదవ్ తల్లి, భార్య ఆయనను కలుసుకునేందుకు పాక్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ సందర్భంగా వారి బొట్టు, మెడలో మంగళసూత్రాలను కూడా పాక్ అధికారులు తొలగించారు. అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు. దీంతో ప్రపంచ దేశాల్లో పాక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా లోక్ సభలో పాక్ పై నిప్పులు చెరిగారు. అయితే దీనిని కప్పిపుచ్చుకునేందుకు మరో దొంగనాటకాన్ని పాక్ ఆడింది.

జాదవ్ చేతనే చెప్పించినట్లుగా....

తాజాగా విడుదల చేసిన వీడియోలో కులభూషణ్ జాదవ్ ‘‘ పాక్ లో చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ఇక్కడి అధికారులు చాలా బాగా చూసుకుంటున్నారు. తల్లి, భార్యను కలుసుకోవడం ఆనందంగా ఉంది. నా ఆరోగ్యం పట్ల నా తల్లి కూడా పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తాను ఇక్కడి జైలులో బాగానే ఉన్నా. జైలు అధికారులు నాకు ఎలాంటి హాని తలపెట్టడం లేదు’’ అంటూ వీడియో విడుదలయింది. అయితే ఈ వీడియో నకిలీదిగా కొట్టిపారేస్తున్నారు. పాక్ జైలులో ఉన్న జాదవ్ ను కలిసేందుకు తల్లి, భార్య వెళ్లినప్పుడు జాదవ్ తలపై గాయాలున్నాయని, అయితే ఈ వీడియోలో అవి కన్పించడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బహుశా జాదవ్ ను బెదిరించి...భయపెట్టి కూడా ఈ వీడియో చిత్రీకరించి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సానుభూతిని పొందేందుకు ఈ తాజా వీడియో ద్వారా పాక్ మరో ప్రయత్నం చేసిందనే భావించవచ్చు.

Similar News