పాక్ అందుకోలేని సాయం ప్రకటించిన రాజ్‌నాథ్!

Update: 2016-10-15 06:00 GMT

ఇరుగు పొరుగు దేశాలు పరస్పరం సహకరించుకోవడం మామూలే. భారత పాక్ దేశాలమధ్య ఎన్ని వైషమ్యాలు నడుస్తూ ఉన్నాఇలాంటి సహకారం కూడా మరోవైపు జరుగుతూనే వచ్చింది. అయితే ఇప్పడు మన దేశ హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పాకిస్తాన్ కు ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఒక విషయంలో అయితే పాకిస్తాన్‌కు ఎంత సాయమైనా అందించడానికి తాము సిద్ధం అని ఆయన ప్రకటించారు. అయితే ఆయన చెప్పిన సాయం అందుకునేందుకు పాకిస్తాన్ ధైర్యం చేయకపోవచ్చు. ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఆ దేశం పోరాడదలచుకుంటే అందుకు తాము సాయం చేస్తామని చెప్పారు. బహిరంగంగా ప్రకటించకపోయినా.. పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదాన్ని పాముకు పాలుపోసినట్లుగా అక్కడి ప్రభుత్వమే పెంచి పోషిస్తున్న సంగతి ప్రపంచం అందరికీ తెలిసిన సంగతే. ఇలాంటి నేపథ్యంలో రాజ్‌నాధ్ ఇచ్చిన ఆఫర్ పాక్ సర్కారును నిజంగా ఇబ్బంది పెడుతుంది.

రాజ్‌నాధ్ ఆఫర్ ను తిరస్కరిస్తే.. అదేదో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆమోదిస్తే.. పాక్ సర్కారు మీద స్థానికంగా చెలరేగే ఉగ్రవాదులు కన్నెర్ర చేస్తారు. ఇలాంటి సంకట స్థితిలో పాకిస్తాన్ పడిపోతుందని అనుకోవచ్చు.

అయినా.. ఉరీ దాడులు, తత్పర్యవసానంగా సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత.. పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ముద్రవేసి ఒంటరిని చేయడానికి భారత్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. అంతర్జాతీయ వేదికలమీద పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం అనే అంశాన్నే ప్రస్తావించింది. అదే సమయంలో పాక్ లో జరగాల్సి ఉన్న సార్క్ సమావేశాలకు సభ్య దేశాలు చాలా వరకు గైర్హాజరయ్యే పరిస్థితి కూడా భారత్ వల్ల ఏర్పడినదే. ఇలాంటి నేపథ్యంలో రాజ్‌నాధ్ ఆఫర్ కూడా పాకిస్తాన్ ను ఇంకా ఇరుకున పడేస్తుంది. పాక్‌కు ఉగ్రవాదంపై పోరాడే ఉద్దేశం ఉంటే మన సహకారం తీసుకోవచ్చునని, ప్రోత్సహించే ఉద్దేశం ఉంటే.. భారత్ సహకారం వద్దనుకోవచ్చునని .. ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్పాలో వారు ఇప్పటినుంచే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ పరిణామాలు వారిని మరింత ఒంటరిగా మారుస్తాయి.

Similar News