కేజ్రీవాల్ అంటే హీరో! ఆయన ఢిల్లీ హీరో! ఇటీవలి ఎన్నికల సమయానికి మాత్రం ఢిల్లీలో ఆయన ఖచ్చితంగా హీరోనే! ప్రస్తుతం ఆ హీరోయిక్ ఇమేజిని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారా లేదా అనేది డౌటే! అయితే.. తాజాగా ఆయనకు మరోసారి హీరో ఇమేజి దక్కింది. అయితే మన దేశంలో కాదు. పాకిస్తాన్‌లో. సర్జికల్ దాడులు జరిగినప్పటినుంచి భారత్ అంటే మండిపడుతున్న పాకిస్తాన్ లో ఇప్పుడు కేజ్రీవాల్‌ను హీరోగా అభివర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయనను అక్కడి మీడియా తెగ కీర్తిస్తోంది.
ఇదంతా ఎందుకు జరిగిందంటే..
మోదీ సర్కారు ఏ పనిచేసినా సరే కేజ్రీవాల్ రంధ్రాన్వేషణ చేసి, అందులో లోపాలను గురించి మాత్రమే మాట్లాడడం తన అలవాటు గా చేసుకున్నారు. సర్జికల్ దాడుల విషయంలోనూ ఆయన అలాంటి వైఖరిని వదులుకోలేదు. ఒకవైపు హేట్సాఫ్ లాంటి పదం వాడుతూనే.. సర్జికల్ దాడులకు కేంద్రప్రభుత్వం ఆధారాలు చూపించాలంటూ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
నిజానికి అచ్చంగా ఇది పాకిస్తాన్ డిమాండ్. అసలిక్కడ సర్జికల్ దాడులే జరగలేదని పాకిస్తాన్ వాదిస్తోంది. వారు అక్కడి మీడియాను కూడా తీసుకెళ్లి.. దాడులు జరగలేదంటూ తమ దేశంలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతర్జాతీయ సమాజానికి అలా చెప్పుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ డిమాండుకు అనుకూలంగా కేజ్రీవాల్ గళం విప్పడం.. ఆశ్చర్యకరం. కేజ్రీ డిమాండ్ పాక్‌కు బాగా రుచించింది. అక్కడి మీడియా సంస్థలన్నీ ఆయనను హీరోగా అభివర్ణిస్తున్నాయి. అక్కడ దక్కే హీరోయిజం సంగతి తర్వాత.. ఆ క్రేజ్ కాస్తా కేజ్రీవాల్‌కు స్వదేశంలో నెగటివ్ మార్కుగా పనిచేయవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.