రోజులు గడిచిపోతున్నాయి. నెలలు కరిగిపోతున్నాయి. సంవత్సరాలు వెళ్లిపోతున్నాయి. అయినా టీడీపీలో సీనియర్లు వేచి చూసిన ఉదయం మాత్రం రావడం లేదు. ఈ పండుగకు కాకపోతే వచ్చే పండుగ అనుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు. వీళ్ల ముందు వర్షం చినుకు కోసం చకోర పక్షికూడా చిన్నబోయేలా ఉంది పరిస్థితి. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోయింది. ఇక ఎన్నికల సంవత్సరం వచ్చేసింది. అయినా నామినేటెడ్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియక సీనియర్లు అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు, చినబాబు, మంత్రి లోకేష్‌కు తెలిసినా.. తెలియనట్టు వ్యవహరిస్తుండటం అగ్నికి ఆజ్యం పోసినట్టు మారుతోంది. దీంతో సీనియర్లందరూ వీరిద్దరి మీద గుర్రుగా ఉంటున్నారట.
నామినేటెడ్ పదవులు భర్తీ ఎప్పుడు?
36నెలలు గడిచినా.. ఇంకా ముప్పయి శాతం నామినేటెడ్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. డిసెంబర్‌లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెప్పడంతో సీనియర్లతో పాటు ఆశావహులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ కొత్త సంవత్సరం కూడా వచ్చేసినా.. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీపై మీనమేషాలు లెక్కిస్తుండటంతో వీరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట. చంద్రబాబు, చినబాబుల హామీలు గాలిలో కలిసి పోయాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏకాభిప్రాయంలేదనే సాకుతో కొన్ని.. అదుగో..ఇదుగో అని మరికొన్నింటి నియామకాలు జరగలేదు.
ముహూర్తాలు బాగా లేవని నెట్టుకొస్తున్నారా?
సుమారు 30 మార్కెట్ యార్డు కమిటీలకు పాలకమండలిని నియమించాల్సి ఉంది. కొంత మంది కార్పొరేషన్ చైర్మన్ పదవుల కాలం పూర్తి అయినా వారికి పొడిగింపు కానీ.. లేక వేరే వారికి కానీ ఇవ్వలేదు. డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం అని, మూఢంలో పదవుల పంపకం చేయకూడదని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఎమ్మెల్సీలు చెబుతున్నారట. తండ్రీకొడుకులిద్దరూ ఇన్ని హామీలిచ్చినా.. ఇంత వరకు అమలు కాలేదని వాపోతన్నారట. కొన్ని నామినేటెడ్ పోస్టుల నియామకాలకు వారిద్దరకు సన్నిహితంగా ఉండే నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
సంక్రాంతి తర్వతనే అంటున్న....
సంక్రాంతి తర్వాతే నామినేటెడ్ పదవుల పంపకం ప్రారంభమవుతుందని కేంద్ర పార్టీ కార్యాలయ నాయకులు చెబుతున్నారు. ఇటీవల కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు చినబాబును కలసి మార్కెట్ కమిటీలు భర్తీ చేయాలని కోరగా.. ఇంకా కమిటీల నియామకం పూర్తి కాలేదా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారట. కమిటీ నియామకాల భర్తీకి ఎవరు అడ్డం పడుతున్నారనే విషయం చినబాబుకు తెలియదేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికైనా పదవుల భర్తీ ఉంటుందో లేక వచ్చే పండుగ ఉగాది పేరు చెబుతారేమోనని సెటైర్లు వేస్తున్నారట. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ భర్తీలో ఎమ్మెల్యేలు,మంత్రులు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మరి మొత్తానికి టీడీపీలో రేగిన ఈ నామినేటెడ్ అసమ్మతిని తండ్రీకొడుకులు ఎలా చల్లారుస్తారో చూడాల్సిందే!!