పవర్ కోసం కాంగ్రెస్ వ్యూహం ఇదేనా ?

Update: 2018-02-12 00:30 GMT

ఎన్నికలకు ఆరునెలల ముందే టికెట్ల పండగ ముగించాలి. దాంతో ఎవరి నియోజకవర్గంలో వారు గెలుపుకోసం అహరహం శ్రమిస్తారు. గ్రూప్ ల గోల టికెట్ల వేళ ఉండదు. ప్రత్యర్థి పార్టీలకు అందనంత ప్రచార పర్వంలో దూసుకుపోయే ఛాన్స్ దక్కుతుంది. ఇది తాజాగా ఏఐసిసి తెలంగాణ ఎన్నికలకు ముందస్తు ప్రణాళిక అని తెలుస్తుంది. హస్తం పార్టీకి నవ నేత సారధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి సాధ్య, అసాధ్యాలపై కాంగ్రెస్ పెద్దలు కసరత్తులు మొదలు పెట్టారని అంటున్నారు.

ముంచుతుందా ? తెలుస్తుందా ?

కాంగ్రెస్ తాజా ఎత్తుగడలు ఇప్పుడు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముందస్తు టికెట్ల పంపిణి తో గెలుపు ధీమా కొందరు వ్యక్తం చేస్తుంటే ఇది అధికార టీఆర్ఎస్ కి అనుకూలంగా మారే ప్రమాదం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ముందే టికెట్లు ప్రకటిస్తే ఆశావహుల్లో నిరాశ పడ్డవారు పక్క పార్టీకి జారుకునే ప్రమాదం పొంచి ఉంటుందని అనుమానిస్తున్నారు మరికొందరు. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపడానికి అన్వేషణ కోసం ఆరునెలలు సమయం చక్కగా ఉపయోగించుకుంటారని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పాత పద్దతే సర్వత్రా శ్రేయస్కరమని కొత్త ఎత్తుగడలు ప్రయోగాలకు అధికారానికి దగ్గరౌతున్న పార్టీని దూరం చేసుకోవడమే అన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక రాహుల్ ఏమి చేయనున్నారో చూడాలి.

Similar News