ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ‌్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పవన్ ఆలోచిస్తున్నారు. జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ వివిధ జిల్లాల కు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. హోదాపై పోరాటం చేయాలని పవన్ కు అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు సూచిస్తున్నారు. దీంతో త్వరలోనే పవన్ ప్రత్యేక హోదాపై కార్యాచరణను ప్రకటించబోతున్నారు.
ప్రత్యేక హోదాపై ఉద్యమం....
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రత్యేక హోదా పై పార్టీ ఉద్యమించకపోతే జనసేన ప్రజల్లో పలుచన బడిపోతుందన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల నుంచి విన్పిస్తోంది. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే కార్యచరణ సిద్ధం చేసుకుని పోరాట బాట పడుతుండగా వారిలో ఒకరిలా కలిసిపోతే మైలేజీ రాదన్నది ఎక్కువమంది పవన్ కు సూచిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ‌్ కూడా ఆలోచనలో పడ్డారు. పోరాటం ఎలా ఉండాలన్న దానిపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలంటే....
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని పవన్ ప్రకటించిన సంగతి తెలసిందే. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలంటే ప్రజల్లోకి వెళ్లేందుకు ఇదే మార్గం కాబట్టి పోరాట పంథాను అనుసరించాలని పవన్ కూడా అభిప్రాయ పడుతున్నారు. అయితే ఉద్యమ పంథా శాంతియుతంగా జరగాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఢిల్లీకి తెగ తగలేలా ఉద్యమం ఉండేందుకు అవసరమైన సలహాలు సూచనలు ముఖ్యనేతలను కోరారు. నిరాహారదీక్షలతో పాటు ఆమరణ దీక్షకు దిగితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా పవన్ సన్నిహితులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపటిలోగా స్పష్టత వస్తుందని చెబుతున్నారు.