పవన్ యాత్ర...టీడీపీకి చేదు మాత్ర...!

Update: 2018-01-27 03:30 GMT

సీమ ప్రాంతంలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఇప్పటి వరకూ జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం, బాధితులను కలుసుకోవడం కోసం మాత్రమే జిల్లాల పర్యటన చేశారు. అయితే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగానని ప్రకటించిన జనసేనాని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేయనున్నారు. అదీ కరవు యాత్రపై పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు తెలంగాణలో రెండు జిల్లాల్లో పవన్ పర్యటనకు మంచి స్పందన రావడంతో అదే ఊపుతో ఏపీలోనూ పవన్ పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు.

మూడు రోజుల పర్యటన....

అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ మొత్తం మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా అనంతపురంలోని గుత్తిరోడ్డులో జనసేన పార్టీ కార్యాలయానికి కూడా పవన్ భూమి పూజ చేయనున్నారు. రెండెకరాల్లో ఈ పార్టీ కార్యాలయాన్ని అతి త్వరలోనే పూర్తి చేసేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. అలాగే భూమి పూజ తర్వాత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అలాగే 28వ తేదీన కదిరికి వెళ్లి అక్కడి లక్ష్మీనరసింహ స్వామిని కూడా పవన్ దర్శించనున్నారు. ఇక్కడి నుంచే పవన్ కల్యాణ్ కరువు యాత్రను ప్రారంభించనున్నారు.

కరవు యాత్రలో భాగంగా....

పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం అనేది స్పష్టం చేయలేదు. పవన్ పర్యటనకు సంబంధించి జనసేన నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కరవు యాత్రలో పవన్ కల్యాణ్ రైతులు, రైతు కూలీలతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతపురం అంటేనే కరువుకు మారుపేరు. ఎంతో మంది ఉపాధి కోసం పుట్టిన గడ్డను వీడి బెంగళూరు, హైదరాబాద్, ముంబయి వంటి ప్రాంతాలకు వలస వెళుతున్నారు.

అధికార పార్టీకి ఇబ్బందే....

ఈ నేపథ్యంలో పవన్ పర్యటన రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఒకవైపు అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తుంటే, పవన్ కరవు యాత్ర చేయడంపై ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచే ప్రధాని కార్యాలయానికి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఇక్కడి రైతులు నడిపారు. కరువ ప్రాంతమైన అనంతపురం జిల్లాకు ప్రత్యేక నిధులను విడుదల చేయాలంటూ లక్షకు పైగా పోస్ట్ కార్డులు ప్రధాని మోడీకి పంపారు. ఈ విషయాలన్నింటీని పవన్ ప్రస్తావించే అవకాశముంది. మొత్తం మీద పవన్ కరవు యాత్ర అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. అయితే ఎప్పటిలాగే పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తారా? లేక విమర్శలు గుప్పిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

పవన్ పర్యటన ఇలా....

అనంతపురంలో పవన్ పర్యటన ఇలా సాగుతుంది. రేపు ఉదయం పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన గుత్తిలో జరిగే ‘‘సీమ కరువుకు పరిష్కార మార్గాలు’’ అనే అంశంపై రైతులు, వ్యవసాయ, నీటిపారుదల నిపుణులతో చర్చిస్తారు. 26న కదిరి చేరుకుని అక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడ నుంచి పుటపర్తికి బయలుదేరుతారు. హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. తర్వాత పుటపర్తి చేరుకుని సత్యసాయి మందిరాన్ని సందర్శిస్తారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మంచినీటి పథకాలను, ఆసుపత్రిని పరిశీలిస్తారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేస్తారు. తర్వాత రోజు ధర్మవరం చేరుకునిచేనేత కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తర్వాత హిందూపురం చేరుకుని అక్కడ జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. 29వ తేదీ సాయంత్రం చిక్ బిళ్లాపూర్ కు వెళ్లి అక్కడ సీవీవీ ఇనిస్టిట్యూట్ ను సందర్శించి తిరిగి హైదరాబాద్ ప్రయాణమవుతారు.

Similar News