జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరికీ అర్థంకారు. తాను ఏం చెప్పదలచుకున్నారో ఆయనకే తెలియదా? లేక పదాల కూర్పులో లోపమా? అధికార పార్టీని తిట్టేశారు. ప్రతిపక్ష వైసీపీని తూర్పారపట్టారు. అనుభవం ఉన్నవారే రాజకీయాల్లోకి రావాలంటారు. రాజకీయాల్లో అనుభవం ఎలా వస్తుంది. అన్న చిరంజీవి ఏ అనుభవంతో ప్రజారాజ్యం పెట్టారు. ఆయన సీఎం అయిపోవాలని అనుకోలేదా? అనుభవం ఎలా వస్తుంది...? ముఖ్యమంత్రి, మంత్రి అయ్యేందుకు అనుభవం కావాలని పవన్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మరి లోకేష్ ఏ అనుభవం ఉండి మంత్రి అయ్యారు. ఎక్కడో మిస్ అవుతున్నారనిపిస్తోంది. తనకు అధికార దాహం లేదంటారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటిస్తారు. అధికార దాహం లేకుంటే పార్టీ ఎందుకు పెట్టినట్లు? ప్రజాసేవ చేయాలనుకుంటే ట్రస్ట్ ద్వారా చేయొచ్చు కదా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ఏపీ రాజకీయాలు పవన్ పర్యటనలతో మరింత వేడెక్కాయి. పవన్ కల్యాణ్ మూడురోజుల పాటు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విశాఖ, పోలవరం, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఎక్కడో మిస్ అవుతున్నట్లుంది....?
పవన్ కు నిజంగా రాజకీయాలపై సీరియస్ నెస్ లేదనేది అర్థమవుతోంది. వాస్తవానికి కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగి దాదాపు పదిహేను రోజులు దాటింది. ఆ ప్రమాదంపై ట్విట్టర్లో స్పందించిన జగన్ ఆ తర్వాత ఇప్పుడు తాపీగా పరామర్శకు ప్రకాశం జిల్లాకు బయలుదేరారు. నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసేవారు. బాధితులకు అండగా నిలబడే వారు. కాని ఇప్పుడు పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ఉపయోగమేంటన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇక మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితుల సంగతీ అంతే. ఎన్నాళ్ల నుంచి ఈ సమస్య రగులుతోంది. ఇప్పటికి పవన్ కు తెల్లారిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోయి పంచ్ లు వేస్తే పాలిటిక్స్ లో సరిపోతుందా? అనేది విశ్లేషకుల అభిప్రాయం. కేవలం ప్రసంగాలతోనే సరిపెట్టడం సరికాదు కదా. మళ్లీ వపన్ ఎప్పుడు కన్పిస్తారన్నది జనసేన అభిమానులు, కార్యకర్తలకు ఎదురవుతున్న ప్రశ్న. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను ప్రయివేటీకరించొద్దని బాధితులు చేస్తున్న ఆందోళనకు పవన్ మద్దతు ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. కాని ప్రధానమంత్రికి లేఖ రాస్తానని చెప్పి వెళ్లిపోయారు. దానికి ముగింపు చెప్పలేకపోయారు. ప్రధానికి లేఖ రాసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? ఇలా పవన్ వేసే అడుగులు రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగానే అనేకమంది చూస్తున్నారు. ఒకవైపు కొత్త రక్తం కావాలంటారు... మరోవైపు అనుభవం ఉండాలంటారు. ఇదేంటి పవన్... మీరు ఎక్కడో... ఏదో మిస్ అవుతున్నట్లున్నారు. అసలు మీ లక్ష్యమేంటో కనీసం మీ అభిమానులకైనా చెప్పండి ప్లీజ్....!