తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ్ పట్ల కొంత సంయమనంగా వ్యవహరించాలని చెబుతున్నా మంత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా మంత్రి పితాని సత్యనారాయణ పవన్ కల్యాణ జెండా కూడా ఏపీలో ఎగరదని, తమ ప్రధాన ప్రత్యర్థి వైసీపీ మాత్రమేనని అనడంతో జనసేనకు, టీడీపీకి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లయింది. ఇటీవల తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీచేస్తామని జనసేన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ ట్వీట్ ఎవరో తెలియక సిబ్బంది చేశారని జనసేన కార్యాలయం చెప్పుకొచ్చింది. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఆ ట్వీట్ పై ఆచితూచి స్పందించారు. కాని కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ఇటీవలే మంత్రి అయిన పితాని సత్యానారాయణ మాత్రం పవన్ కల్యాణ పార్టీ జెండా ఎగరదని చెప్పడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మంత్రికేం తెలుసునని, ఆయనలాగా పార్టీ లాగే మనస్తత్వం తమ అధినేతది కాదని అంటున్నారు.
పవన్ స్పందన ఇదే.....
మరోవైపు దీనిపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అశోక్ గజపతిరాజుగారికి పవన్ కల్యాణ‌్ ఎవరో తెలియదు. మంత్రి పితాని సత్యనారాయణ గారికి వపన్ కల్యాణ్ ఎంటో తెలియదు. సంతోషం అంటూ పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేయడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కొందరు కాపు నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ‌్ ను ఆయన అభిమానులను రెచ్చగొట్టేవిధంగా మంత్రి పితాని మాట్లాడారని ఆయనచేత వివరణ ఇప్పించాలని కాపునేతలు చంద్రబాబును కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో అశోక్ గజపతి రాజు కూడా పవన్ కల్యాణ‌్ ఎవరో తెలియదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పవన్ ను దగ్గరకు తీయాలని చూస్తుంటే... కొందరు నేతలు మాత్రం తమ వ్యాఖ్యలతో దూరం చేస్తున్నారని టీడీపీ కాపు సామాజిక వర్గం నేతలు వాపోతున్నారు.