పవన్ ప్రశ్నలకు బాబు ఆన్సర్లివే

Update: 2018-03-16 11:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కు తాను నాలుగేళ్లు మంచిగా కన్పించానని, అయితే ఉన్నట్లుండి తనపైనా, తన పార్టీపైన విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాను మూడు మాటల్లో ఆరు అబద్ధాలు మాట్లాడుతున్నానని పవన్ కల్యాణ్ ఆరోపించారని, తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను మభ్యపెట్టే పనిచేయనని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చంద్రబాబు ఆవేశపూరితంగా మాట్లాడారు. తనను బలహీన పర్చేందుకు మహాకుట్ర జరుగుతుందని చెప్పారు.

అవినీతి ఉండకూడదనే....

తాము 25 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలకు సిద్ధం చేశామని పవన్ తనపై ఆరోపణ చేశారన్న చంద్రబాబు , వెయ్యి, ఐదు వందల పెద్ద నోట్లను రద్దు చేయమని చెప్పింది తానేనని గుర్తు చేశారు. అవినీతి లేకుండా ఎన్నికలు జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. మంచి పనులు చేస్తే ఓట్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసింది తానేనని చంద్రబాబు చెప్పారు. తనకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి గల కారణాలపై పవన్ కల్యాణ్ అసత్య ఆరోపణలు చేశారన్నారు. తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాను తప్ప సొంత ప్రయోజనాల కోసం కాదన్నారు.

అవగాహన లేకుండా.....

అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఫుడ్ ప్యాక్టరీ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, అక్కడి ప్రజలను పట్టించుకోకుండా ఫ్యాక్టరీని పెట్టారని పవన్ ఆరోపించారని, కాని మెగా ఆక్వాఫుడ్ పార్క్ యజమానులు తన బంధువులా? అని ప్రశ్నించారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ అక్కడ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. తుందుర్రు నుంచి సముద్రంలోకి కాలుష్యం లేకుండా నీటిని వదలేందుకు పైపులైను నిర్మిస్తున్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. పోలవరం కాంట్రాక్టును తనకు కావాల్సిన వారికి ఇప్పించుకున్నానని పవన్ ఆరోపించారని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే పోలవరం పూర్తి చేయాలని, అందుకు అడ్డంకులు కల్పించవద్దని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ లో కరువు ఉండదనే తాను త్వరితగతిన పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నానన్నారు. ‘‘విభజన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన మోడీని నిలదీయండి. నన్ను కాదు’’ అని చంద్రబాబు పవన్ పై ఫైర్ అయ్యారు.

Similar News