వైసీపీ అధినేత జగన్ పవన్ పై సెటైర్లు వేశారు. చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో పాదయాత్ర చేస్తున్న జగన్ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాటలను ఎక్కుబెట్టారు. చంద్రబాబు చేసినవన్నీ మోసపూరిత వాగ్దానాలేనని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబుపై విశ్వసనీయత కోల్పోవడంతో వచ్చే ఎన్నికలకు ముందు ఈసారి చంద్రబాబు కొత్త ఎత్తులు వేసే అవకాశముందన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఈసారి నటుడిని వెంటపెట్టుకుని వస్తారన్నారు. చంద్రబాబు మంచోడని ఆ యాక్టర్ చేత జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తారని, ఆ నటుడి మాయమాటలను నమ్మొద్దని ప్రజలకు జగన్ సూచించారు. ఇవన్నీ పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకునే జగన్ చేశారు. ఇటీవల పవన్ చంద్రబాబును పొగుడుతూ, వైసీపీని, జగన్ ను డైరెక్ట్ గా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ మరోసారి చంద్రబాబుకు మద్దతు పలికే అవకాశముందని గ్రహించిన జగన్ నటుడి మాటలను నమ్మవద్దని జనాలకు నూరిపోయడం ప్రారంభించారు.
రాజీనామాలకు సిద్ధపడాలన్న.....
నిన్న రాత్రి ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. వైసీపీ పార్లమెంటు సభ్యులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రత్యేక హోదా పై పార్లమెంటు సమావేశాల్లో పట్టుబట్టాలని నిర్ణయించారు. అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధపడాలని జగన్ వైసీపీ ఎంపీలకు పరోక్షంగా సూచించినట్లు తెలిసింది. పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే వైసీపీ ఎంపీల చేత ఈ సమావేశాల్లోనే రాజీనామా చేయించేలా జగన్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై కూడా పార్లమెంటు సభ్యులతో జగన్ చర్చించారు. పార్లమెంటు సమావేశాల అనంతరం నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకహోదాపై తాము పోరాడిన తీరును వివరించాలని కూడా జగన్ ఎంపీలను కోరినట్లు తెలిసింది.
జగన్ 32వ రోజు షెడ్యూల్...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 32వ రోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఉదయం పదిగంటలకు రాప్తాడు మండలం ఆత్మకూరు మండలం తలుపూరు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం వడ్డుపల్లి, మదిగూడ గ్రామానికి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.